ఇప్పుడు మా అమ్మ గుర్తుకొస్తోంది! - జెనీలియా

7 Mar, 2015 00:27 IST|Sakshi
ఇప్పుడు మా అమ్మ గుర్తుకొస్తోంది! - జెనీలియా

జెనీలియా... ఈ పేరు చెప్పగానే ‘బాయ్స్’ చిత్రంలోని టీనేజ్ అమ్మాయి దగ్గర నుంచి ‘బొమ్మరిల్లు’లోని హాసిని పాత్రధారిణి దాకా ఎన్నో వెండితెర దృశ్యాలు గుర్తుకొస్తాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్రస్థాయికి చేరుకొని, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్ళి చేసుకున్న ఈ అందాల నటి కొద్ది నెలల క్రితమే ఒక బాబుకు తల్లి అయ్యారు. అమ్మగా కొత్త బాధ్యతలు మీద పడ్డ జెనీలియా ఈ కొత్త పాత్రను కూడా బాగా ఆస్వాదిస్తున్నారు.

గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లల డయాపర్ల బ్రాండ్ ‘ప్యాంపర్స్’ ప్రకటనకు ఎండార్స్‌మెంట్ చేసిన జెనీలియా తన తల్లి పాత్ర గురించి తొలిసారిగా పంచుకున్న విశేషాలు...

 
ఏకకాలంలో ఇంటి పని, చంటిబాబు పని చూసుకోవడం కొద్దిగా కష్టమే. కానీ, నా తొలి ప్రాధాన్యం బాబుకే! ఆ తరువాతే ఇంటి వ్యవహారాలు. మా బాబు రియాన్‌కు మూడు నెలలే. అదృష్టం ఏమిటంటే - రియాన్ రాత్రంతా నిద్రపోతాడు. అందువల్ల తల్లిగా నేను హ్యాపీ. నేను సంతోషంగా ఉండడం వల్ల అన్ని పనులూ సవ్యంగా చేసుకోగలుగుతున్నా. సానుకూలంగా స్పందించగలుగుతున్నా. బాబును హాయిగా ఆడించగలుగుతున్నా.
పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాబు పనులన్నీ స్వయంగా నేనే చేసుకోవడం వల్ల బాగా అలసిపోతున్నా. అయితే, కొత్తగా వచ్చిన ఈ తల్లి పాత్రను బాగా ఆస్వాదిస్తున్నా. తల్లి కావడం ఒక అద్భుతమైన అనుభూతి. నాకు పదే పదే మా అమ్మ గుర్తుకొస్తుంటుంది. మనకంటూ ఒక బిడ్డ పుట్టాక, మనకు మన అమ్మ మీద అమితంగా ప్రేమ పెరుగుతుందంటే నమ్మండి.
 చంటిపిల్లాణ్ణి పెంచడంలో మా అమ్మ నుంచి, మా అత్త గారి నుంచి బోలెడన్ని సలహాలు తీసుకుంటూ ఉంటా. అయితే, నా బుద్ధికి తోచినట్లు చేస్తా. చంటిపిల్లాడికి ఏం కావాలన్నది తల్లికి తెలిసినట్లుగా వేరెవరికీ తెలియదు. అయినా ఎవరో అన్నట్లు, చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ, చెడ్డ తల్లులు మాత్రం ఉండరు!
 మా ఆయన రితేశ్ దేశ్‌ముఖ్ కూడా పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. నేను గర్భవతినన్న సంగతి తెలిసిన క్షణమే ఆయన ఒక మాట అన్నారు... ‘నిజానికి, నువ్వొక్కదానివే కాదు, మన ఇద్దరం ఇప్పుడు ప్రెగ్నెంటే!’ జీవిత భాగస్వామి నుంచి ఏ స్త్రీకైనా అంతకు మించి ఇంకేం కావాలి! తండ్రి కాబోతున్న క్షణంలో ఆయనకొచ్చిన గొప్ప ఆలోచన అది. ఇలాంటి ఆలోచన వల్ల జీవిత భాగస్వాములిద్దరూ ఆ గర్భధారణ సమయాన్నీ, ప్రసవాన్నీ కలసి ఆస్వాదిస్తారు. అలాగే, తల్లితండ్రులుగా వచ్చిపడ్డ కొత్త బాధ్యతల్ని పంచుకుంటారు. రితేశ్ కూడా మా బాబుకి డయాపర్స్ మారుస్తారు, స్నానం చేయిస్తారు. బాబు నిద్రపోకపోతే, నాతో పాటే రాత్రంతా మెలకువగా ఉంటారు. పసిపిల్లల్ని పెంచడం కేవలం తల్లి బాధ్యతే కాదు, తండ్రి బాధ్యత కూడా అని గ్రహిస్తే, ఆ సంసారంలో అంతకన్నా ఆనందం ఏముంటుంది!
 నన్నడిగితే తల్లులకు మాతృత్వపు సెలవు ఇచ్చినట్లే, తండ్రులకు ‘పేటర్నిటీ లీవ్’ ఇవ్వాలి. దాన్ని చట్టబద్ధం చేయాలి. లేకపోతే, ఇతర పనుల్లో పడిపోయి, భార్యాబిడ్డలతో గడిపే తీరికే వాళ్ళకు ఉండదు.
పెళ్ళయ్యాక మీలో వచ్చిన మార్పేమిటి? తల్లయ్యాక వచ్చిన మార్పేమిటి? అని నన్ను అందరూ అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే, మనం మనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకొంటూ పిల్లల్ని పెంచాలి. అది చంటిపిల్లల పెంపకంలో ప్రతిఫలిస్తుంది. అలా కాకుండా మరొకరిలా ఉండడానికి ప్రయత్నిస్తే అప్పుడిక మొత్తం కుప్పకూలిపోతుంది. హుషారుగా, ఆనందంగా ఉండే అమ్మాయి మా అమ్మ అని గుర్తించేలా మా అబ్బాయి పెరగాలనుకుంటున్నా.
పసిబిడ్డకు తల్లి అయ్యాక సెలబ్రిటీలకే కాదు, ఎవరికైనా శారీరక మార్పులు తప్పవు. గర్భవతిగా ఉన్నప్పుడు మనం ఎంతైనా లావు కావచ్చు. బిడ్డ పుట్టాక మళ్ళీ క్రమంగా అందం మీద దృష్టి పెట్టక తప్పదు. అలాగే, తల్లి పాత్ర వల్ల నటిగా లైమ్‌లైట్‌కు దూరమయ్యానని అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, జీవితంలో నేనేమీ మిస్సవడం లేదు. తల్లి పాత్ర అలవాటయ్యాక ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నా. మొన్నటిదాకా నటిగా, నిన్న గర్భవతిగా, ఇప్పుడు తల్లిగా - ఇలా ప్రతి దశనూ ఆస్వాదిస్తూనే ఉన్నా.