కిడ్నాప్ చేయడమే రావణాసురుడి తప్పా?: వర్మ

16 Nov, 2015 17:02 IST|Sakshi
కిడ్నాప్ చేయడమే రావణాసురుడి తప్పా?: వర్మ

ఎప్పుడూ ప్రస్తుత పరిణామాల మీద మాత్రమే విరుచుకుపడే రాంగోపాల్ వర్మ ఒక్కసారిగా ఇతిహాసాల మీద పడ్డాడు. రామాయణంలోని రావణాసురుడిని, ప్రస్తుత కాలంలోని కరుడుగట్టినవారితో పోల్చి అయనకన్నా పెద్ద విలన్‌లు భారతదేశంలో కుప్పలుతెప్పలుగా ఉన్నారంటూ  తనదైన శైలిలో చెప్పాడు. రాంగోపాల్ వర్మ ఏమన్నారో ఆయన ట్వీట్‌లలోనే...

''రావణాసురుడు సీతను అపహరించి తన ఆధీనంలో నెలల తరబడి ఉంచాడు. కానీ ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టాడా? ... ఆహా ఏదో అడుగుతున్నా. రావణుడు విలన్ అని తెలుసు.. కానీ హిట్లర్, ఒసామా బిన్ లాడెన్లలా.. కరుడు గట్టిన విలన్లా ప్రవర్తించినట్టు ఎప్పుడూ వినలేదు. ఒక విలన్లా రావణాసురుడు ఎప్పుడూ చేయలేదు... అయినా నిజంగా అతనొక పెద్ద విలనా? (దీనిపై పోల్ క్వశ్చన్ కూడా పెట్టారు)
 
నేను చదివిన వాటిలో రాక్షసులు ఎవరూ రాక్షసులు చేసే పనులు చేయలేదు. మరోలా చెప్పాలంటే రచయితలు ఎవరూ క్యారెక్టర్లని సరిగా డెవలప్ చేయలేదు కానీ మనం వాటిని గుడ్డిగా నమ్ముతున్నాం.. సీతను అపహరించడమే రావణాసురుడి తప్పయితే..  భారత్లో ప్రతి నెలా 100 మందికి పైగా రావణాసురుడి కన్నా పెద్ద విలన్లను మనం అందించొచ్చని అనుకుంటున్నాను'' అని వర్మ అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి వరుసగా ట్వీట్లు చేసుకుంటూ పోయారు.

ఐఎస్ఐఎస్ని తయారు చేసి పెంచి పోషించింది అమెరికా కాదా? అని ట్వీట్ చేశారు.