‘మన ఊరి...’లో అదే చెప్పాలనుకున్నా: ప్రకాశ్‌రాజ్

18 Sep, 2016 02:16 IST|Sakshi
‘మన ఊరి...’లో అదే చెప్పాలనుకున్నా: ప్రకాశ్‌రాజ్

 ‘‘ఇప్పుడిప్పుడే భారతీయ సినిమా కొత్త దిశలో పయనిస్తోంది. ఈ టైమ్‌లో ‘మన ఊరి రామాయణం’ వస్తుండడం ఆనందంగా ఉంది. నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ప్రకాశ్ రాజ్, ఈ సినిమాతో దర్శకుడిగానూ జాతీయ అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున.
 
  ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, సత్య ముఖ్యతారలుగా ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో రామ్‌జీతో కలసి నిర్మించిన సినిమా ‘మన ఊరి రామాయణం’. ఇళయరాజా స్వరపరిచిన పాటల సీడీలను నాగార్జున విడుదల చేశారు. ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘ప్రతి మనిషిలో రాముడు, రావణుడు, ఆంజనేయుడు, శూర్పణఖ ఉంటారు. అవసరం, పరిస్థితులను బట్టి క్యారెక్టర్ బయటికొస్తుంది. ఈ సినిమాలో నేను చెప్పాలనుకున్నది అదే.
 
 నన్ను మహా నటుడంటుంటే ఎక్కడో నాకు తెలియకుండా కంఫర్ట్ జోన్‌లోకి వెళ్తున్నా. నేను నిత్య విద్యార్థిని. అందుకే దర్శకుడినయ్యా. ఈ సినిమా విడుదలకు అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఎంతో సహకరిస్తోంది’’ అన్నారు. దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, సుకుమార్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, హీరోయిన్ ప్రియమణి, నటుడు సత్య, రచయిత భాస్కరభట్ల, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.