గౌతమ్‌తో కలిసి నటించాలనుంది!

31 Mar, 2015 00:23 IST|Sakshi
గౌతమ్‌తో కలిసి నటించాలనుంది!

 సరిగ్గా యాభై ఏళ్ల క్రితం ఈ రోజే సూపర్‌స్టార్ కృష్ణ తొలి చిత్రం ‘తేనె మనసులు’ విడుదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన చేసిన సినిమాలు... ప్రయోగాలు... సాహసాలు తెలుగు తెరను సుసంపన్నం చేశాయి. తన స్వర్ణోత్సవ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ కృష్ణ పత్రికల వారితో ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు.
 
  ఈ 50 ఏళ్లల్లో విజయాలూ చూశాను, అపజయాలూ చూశాను. విజయాలకు పొంగిపోలేదు... అపజయాలకు కుంగిపోలేదు. రెంటినీ సమానంగా తీసుకున్నా. పనిలోనే ఆస్వాదన పొందా. ఖాళీగా ఉండటం నాకస్సలు ఇష్టం ఉండేది కాదు.
 
  తొలి పదేళ్లల్లో రోజుకు మూడు షిఫ్టులు పని చేశా. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి     9 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ పని చేశా. ఇలా చేసినా మళ్లీ ఉదయం 7 గంటలకు ఠంచనుగా షూటింగ్‌కి వెళ్లిపోయేవాణ్ణి.
 
  నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా, పంపిణీదారునిగా, ప్రదర్శకునిగా, ఎడిటర్‌గా... ఇలా సినిమా పరిశ్రమతో నాది విడదీయలేని బంధం. అన్ని రకాల పాత్రలూ చేశాను. కానీ ‘ఛత్రపతి శివాజి’ సినిమా చేయాలనే కోరిక మాత్రం మిగిలిపోయింది. అప్పటికీ ‘డాక్టర్-సినీ యాక్టర్’, ‘నంబర్‌వన్’ సినిమాల్లో శివాజీ గెటప్‌లో కొద్దిసేపు కనిపించి ముచ్చట తీర్చుకున్నా.
 
  మహేశ్ నా పేరు నిలబెట్టాడు. తనకు నేను సలహాలు ఇవ్వడం అంటూ ఉండదు. నిర్ణయాలన్నీ అతనే తీసుకుంటాడు. మహేశ్‌ని జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో చూడాలని నా కోరిక.‘ప్రేమకథా చిత్రమ్’ను హిందీలో పద్మాలయా బేనర్‌లో త్వరలో రీమేక్ చేయబోతున్నాం. మారుతి డెరైక్ట్ చేస్తాడు. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని ఆ మధ్య కొన్ని సినిమాలు చేశాను. నేను అలాంటి సినిమాలు చేయడం అభిమానులకు ఇష్టం లేదు. అందుకే ఇకపై మంచి పాత్ర అయితేనే, అదీ పెద్ద సినిమా అయితేనే నటిస్తా. కథ కుదిరితే నా మనవడు గౌతమ్‌తో కలిసి నటించాలనుంది.