నాకో బిగ్ హిట్ రాబోతోంది!

31 Jul, 2013 22:49 IST|Sakshi
నాకో బిగ్ హిట్ రాబోతోంది!

వరుసగా రెండు పరాజయాలు వస్తే చాలు... ‘అమ్మడి పని అయిపోయింది’ అని అటు మీడియాలో, ఇటు పరిశ్రమలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసుకుంటుంటారు. అదే ప్రారంభం నుంచీ ఫ్లాపులైతే.. ఇక ఆ హీరోయిన్‌ని లెక్కలోకి కూడా తీసుకోరు. ఈ విషయంలో కన్నడ కనకాంబరం ప్రణీత మాత్రం మినహాయింపే. ఎందుకంటే.. ప్రారంభం నుంచి ఫ్లాపులతోనే కాపురం చేస్తున్నా.. అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మను వదలడం లేదు. ‘ఒకదాన్ని మించింది ఒకటి’ అన్నట్లు... పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రణీతను వరిస్తున్నాయి. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ ఫ్లాప్ అవ్వగానే... ‘బావ’ చిత్రంతో స్టార్ హీరో సిద్దార్థ్‌తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేశారు ప్రణీత. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేయగానే... ‘ప్రణీత ఇక ఇంటికే’ అనుకున్నారంతా. కానీ వెంటనే కోలీవుడ్‌లో అడుగుపెట్టి... ‘శకుని’తో కార్తీతో జత కట్టి మళ్లీ అందరినీ నివ్వెరపరిచారు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా... పవర్‌స్టార్‌తోనే ‘సై’ అనేశారు ప్రణీత. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి లోను చేసే కెరీర్ గ్రాఫ్ తనది. ఇటీవలే ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని తన పాత్ర గురించిప్రణీత మాట్లాడుతూ -‘‘ఈ సినిమాతో నా ఎదురు చూపులు ఫలించనున్నాయి.
 
  నాకో బిగ్ హిట్ రాబోతోంది. నేను నమ్మకంగా చెబుతున్న మాట ఇది. పవర్‌స్టార్ సినిమా అంటే నే మినిమమ్ గ్యారెంటీ. విడుదలైన వారానికే ఆయన సినిమాలు సక్సెస్ బార్డర్‌ని దాటేస్తుంటాయి. ఇక ‘అత్తారింటికి దారేది’ విషయానికొస్తే.. బ్లాక్‌బస్టర్ చిత్రానికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్న సినిమా ఇది. ఇందులో బాపు బొమ్మలాంటి అందమైన పాత్ర చేశాను. కచ్చితంగా నాకు మంచి పేరు తెచ్చే పాత్ర ఇది. ఈ సినిమా విషయంలో నాకు ప్రమోషన్ లేకపోయినా ఫర్లేదు. హిట్ కొడితే చాలు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత టాలీవుడ్ దర్శక, నిర్మాతలందరూ నా వెంటపడతారు’’ అని ధీమా వ్యక్తం చేశారు ప్రణీత. ప్రస్తుతం ‘పిజ్జా’ కన్నడ రీమేక్ ‘విజిల్’ చిత్రానికీ, మరో కన్నడ చిత్రం ‘అంగారక’కు సైన్ చేశారు ప్రణీత.