రైలు కిందపడి చస్తాను కాని..

21 Jan, 2018 20:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అవసరమైతే రైలు కిందపడి చస్తాను కాని నీ దగ్గరకు మాత్రం తిరిగి రాను’ .. సీనియర్‌ నటి ఖుష్బూ నోటి నుంచి ఒకప్పుడు వెలువడిన మాటలివి. నిజజీవితంలో కన్నతండ్రితోనే ఈ మాటలు అన్నట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. తాను ఎందుకు ఈ మాటలు అనాల్సివచ్చిందో ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌ 2018లో వివరించారు. ‘వుమెన్‌ పబ్లిక్‌ లైఫ్‌: ది పర్సనల్‌ ఈజ్‌ పొలిటిక్‌’  పేరుతో జరిగిన సెషన్‌లో గౌతమి, కాజల్‌, తాప్సితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తండ్రి పెట్టే వేధింపులు భరించలేక చిన్నతనంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని వెల్లడించారు.

‘మా నాన్నకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్న ఉద్దేశంతో చిన్న వయసులోనే ఆయనపై తిరుగుబాటు చేశాను. మా అమ్మ, సోదరులను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. మా నాన్న ఆడవాళ్లను చులకనగా చూసేవాడు. అసభ్యంగా మాట్లాడేవాడు. నేను ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు నాకింకా గుర్తుంది. అది 1986, సెప్టెంబర్‌ 12. తనను కాదని బయటకు వెళ్లి బతకలేమని, మళ్లీ తన దగ్గరకు వచ్చి ప్రాధేయపడాల్సి వస్తుందని మా నాన్న అన్నాడు. అప్పుడు ఆయనతో ఒకటే చెప్పాను. అలాంటి పరిస్థితే వస్తే నా సోదరులు, అమ్మను చంపేసి రన్నింగ్‌ ట్రైన్‌ ముందు దూకి చస్తాను గాని, నీ దగ్గరకు మాత్రం తిరిగిరానని చెప్పినట్టు’ వెల్లడించారు.

చిన్నతనంలోనే తెగువ చూపించిన ఖుష్బూ మూడు దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు. ఇన్నేళ్లలో మళ్లీ తండ్రిని ఆమె కలవలేదు. ‘మా నాన్నను మళ్లీ చూడటం నాకు ఇష్టం లేద’ని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు