ఇచ్చట.. గ్యారంటీ ఇస్తున్నా

31 Jan, 2020 04:13 IST|Sakshi
మీనాక్షీ చౌదరి, సుశాంత్

– సుశాంత్‌

సుశాంత్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్‌’ అనేది ఉప శీర్షిక. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వంలో రవిశంకర్‌ శాస్త్రి, హరీష్‌ కొయలగుండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి వెంకటరత్నం కెమెరా స్విచాన్‌ చేయగా, యోగేశ్వరమ్మ క్లాప్‌ ఇచ్చారు. నాగసుశీల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుశాంత్‌ మాట్లాడుతూ– ‘‘కొత్తరకం సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో కూడా కొత్తదనం ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలను. దర్శన్‌ మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు’’ అన్నారు. ‘‘ప్రపంచమంతా తిరిగినా మళ్లీ ఇంటికే రావాలని మా గ్రాండ్‌మదర్‌ భానుమతి (దివంగత నటి, గాయని, దర్శకురాలు) గారు నాకు చెప్పేవారు.. అలా కొంతకాలం తర్వాత నేను తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను.

మా ఫ్యామిలీకి, మా హీరో సుశాంత్‌ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మా కాంబినేషన్‌ సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు రవిశంకర్‌శాస్త్రి. ‘‘నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నేను నిర్మాతగా మారతానని ఊహించలేదు. అందులోనూ భానుమతిగారి మనవడు రవిశంకర్‌శాస్త్రిగారితో కలిసి ఈ సినిమా చేయడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాను. ఇదంతా సుశాంత్‌గారి వల్లే’’ అన్నారు హరీష్‌. ‘‘2010లో నా స్నేహితుల జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలకు కొన్ని సినిమాటిక్‌ అంశాలను ఈ కథలో జోడించాం. ఈ సినిమా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం’’ అన్నారు దర్శన్‌. ‘‘తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం కావాలనే నా కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మీనాక్షి. ‘‘ఈ సినిమాలో హీరోయిన్‌ అన్న పాత్ర చేస్తున్నాను’’ అన్నారు వెంకట్‌.
ఇంకా నటులు అభినవ్‌ గోమటం, ప్రియదర్శి, చైతన్య మాట్లాడారు.

మరిన్ని వార్తలు