‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీ రివ్యూ

25 Dec, 2019 14:22 IST|Sakshi
Rating:  

చిత్రం: ఇద్దరి లోకం ఒకటే
జానర్‌: లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామా
నటీనటులు: రాజ్‌ తరుణ్‌, షాలినీ పాండే, మాస్టర్‌ భరత్‌, నాజర్‌, సిరివెన్నెల రాజా, సిరి, 
సంగీతం: మిక్కీ జే మేయర్‌
దర్శకత్వం: జీఆర్‌ కృష్ణ(జి. కృష్ణారెడ్డి)
నిర్మాత: దిల్‌ రాజు
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్

గత కొంతకాలంగా సక్సెస్‌ లేక యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ వెనకబడిపోయాడు. కెరీర్‌ ఆరంభంలో ఒకటి రెండు విజయాలను సొంతం చేసుకున్న ఈ యంగ్‌ హీరో అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ విజయాలు మాత్రం అతడి దరిచేరడంలో లేదు. దీంతో సినిమాలకు చిన్న విరామం తర్వాత ఓ విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఆడు మగాడ్రా బుజ్జి’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీఆర్‌ కృష్ణ డైరెక్షన్‌లో రాజ్‌తరుణ్‌, షాలినీ పాండే హీరోహీరోయిన్‌లుగా తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ ఏడాది దిల్‌ రాజు నిర్మాణంలో వచ్చిన ఎఫ్‌2, మహర్షి వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల తర్వాత వస్తుండటంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. క్రిస్మస్‌ కానుకగా బుధవారం ప్రేక్షకుల మది తట్టిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది?. ఈ చిత్రంతో దిల్‌ రాజు ఈ ఏడాది హ్యాట్రిక్‌ సాధించాడా? రాజ్‌ తరుణ్‌ సక్సెస్‌ బాట పట్టాడా? అనేది రివ్యూలో చూద్దాం. 

కథ:
మహి (రాజ్‌తరుణ్‌) ఓ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్‌. తాతా (నాజర్‌) కోరిక మేరకు వర్ష (షాలినీ పాండే) సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ దశలో మహితో వర్షకు పరిచయం ఏర్పడుతుంది.  అయితే వీరిద్దరి పరిచయం ఇప్పడిది కాదని చిన్ననాటిదని తెలుసుకుంటారు. అంతేకాకుండా మహి ప్రోద్బలంతో వర్ష హీరోయిన్‌ అవుతుంది. అంతేకాకుండా చిన్నతనం నుంచే ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమలో పడతారు. అయితే అప్పటికే రాహుల్‌(రాజు సిరివెన్నెల) అనే వ్యక్తితో పెళ్లికి రెడీ అయిన వర్ష, మహితో ప్రేమపై ఎటూ తెల్చుకోలేకపోతుంది. మరోవైపు మహి తీవ్ర గుండెజబ్బుతో భాదపడుతున్న విషయం కూడా తెలుస్తోంది. చివరకి వర్ష, మహిలు ఒక్కటయ్యారా? చిన్న తనం నుంచి వీరి ప్రేమ ప్రయాణంలో ఎదురైన సమస్యలేంటివి? వీరిద్దరి లోకం ఒకటే ఎలా అయింది? అనేదే మిగతా కథ. 

నటీనటులు: 
యాజ్ యూజ్‌వల్‌గా రాజ్‌ తరుణ్‌ తన నటనతో మెప్పించాడు. కథకు అనుగుణంగా సెటిల్డ్‌ ఫర్ఫామెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా అర్జున్‌ రెడ్డి తర్వాత హీరోయిన్‌ షాలినీ పాండే సూపర్బ్‌ నటనతో ఆకట్టుకుంది. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అలరించింది. షాలిని తల్లి పాత్రలో కనిపించిన రోహిణి మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రాజు సిరివెన్నెల, మాస్టర్‌ భరత్‌, సిరి, తదితర నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ: 
ప్రేమ కథలు ఎప్పుడూ బాగుంటాయి. అయితే ఆ కథలను దృశ్యరూపంలో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడమనేది దర్శకుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో డైరెక్టర్‌ జీఆర్‌ కృష్ణ నూటికి నూరు మార్కులు సాధించారు. తను అనుకున్న కథను ఎక్కడా డీవీయేట్‌ కాకుండా, అనవసరమైన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి వెళ్లకుండా సినిమాను చాల చక్కగా ప్రజెంట్‌ చేశాడు. ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా, క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా హీరోహీరోయిన్ల ఫ్లాష్‌బ్యాక్‌ సీన్లతో ప్రేక్షకుల్ని కూడా ఆ కాలంలోకి తీసుకెళతాడు దర్శకుడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ను చాలా ఎమోషనల్‌గా చూపించారు.  

ఇక సినిమాకు సినిమాటోగ్రఫీ ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది. ఊటీ అందచందాలతో పాటు, హీరోహీరోయిన్స్‌ల మధ్య ఎమోషన్‌ సీన్స్‌ తెరపై అందంగా కనిపించేలా చేశారు. అంతేకాకుండా కెమెరామెన్‌ తన పనితనంతో సినిమాకు రిచ్‌ లుక్‌ను తీసుకొస్తాడు. ఇక లవ్‌ స్టోరీలకు ప్రధానంగా కావాల్సింది సంగీతం. ఫ్రెష్‌ లవ్‌ సాంగ్స్‌ను ఆడియన్స్‌ ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఈ విషయంలో మిక్కీజెమేయర్‌ కాస్త తడపడినట్లు అనిపిస్తోంది. రోటీన్‌ పాటలతో కాస్త ఇబ్బంది పెట్టాడు. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అంత కొత్తగా ఏమనిపించలేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిఉండేది. నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. 

ప్లస్‌ పాయింట్స్‌
రాజ్‌ తరుణ్‌, షాలినీ పాండేల నటన
హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌
సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌
ఎడిటింగ్‌
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌ డెస్క్‌

Rating:  
(2.75/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు