ఆ సినిమానే ప్రేరణ అంటున్న కోనేటి శ్రీను

9 Aug, 2013 01:02 IST|Sakshi
ఆ సినిమానే ప్రేరణ అంటున్న కోనేటి శ్రీను
 ‘‘కరీనాకపూర్ వేశ్యగా నటించిన ‘ఛమేలీ’ చిత్రం నాకెంతో నచ్చింది. అలాంటి నేపథ్యంతో తెలుగులో ఓ సినిమా ఎందుకు చేయకూడదు అనిపించి ఈ కథ తయారు చేసుకున్నాను’’ అని దర్శకుడు కోనేటి శ్రీను చెప్పారు. ‘అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారాయన. వరుణ్‌సందేశ్, హరిప్రియ జంటగా లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది.
 
 శ్రీను గురువారం విలేకరులతో మాట్లాడుతూ -‘‘వరుణ్‌సందేశ్ ఇందులో అద్భుతంగా నటించారు. హీరోయిన్‌గా చాలామందిని అనుకున్నాం. చివరికి హరిప్రియను ఎంచుకున్నాం. ప్రథమార్ధంలో వేశ్యగా, ద్వితీయార్ధంలో ప్రేమలో పడ్డ అమ్మాయిగా చక్కగా నటించింది’’ అన్నారు. ఇంకా చెబుతూ-‘‘స్వతహాగా నేను డాన్సర్‌ని.
 
 ఏడో ఏటే స్టేజ్ షోలు చేశా. కోనేటి డాన్స్ ఇనిస్టిట్యూట్’ పేరుమీద ఓ ఇనిస్టిట్యూట్ కూడా నడిపాను. ఆ అనుభవంతోనే ఇందులో ‘మనసులోనా...’ పాటకు కొరియోగ్రఫీ చేశాను. చూసిన వారందరూ ఆ పాటలోని నా కొరియోగ్రఫీని మెచ్చుకుంటున్నారు. త్వరలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేస్తున్నానని కోనేటి శ్రీను చెప్పారు.