అందరూ చూసే సినిమాలు తీస్తాం

19 Sep, 2017 12:07 IST|Sakshi
అందరూ చూసే సినిమాలు తీస్తాం

‘‘చిన్నారుల నుంచి పెద్దల వరకూ కుటుంబమంతా చూసే చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశంతో చిత్రపరిశ్రమకు వచ్చాను. అనుబంధాలు, ఆప్యాయతలకు అర్థం చెప్పే చిత్రాలు తీయాలని మా మనవరాలు వైష్ణవి పేరు మీద ఈ ‘వై.వి. కంబైన్స్‌’ను స్థాపించాం. దీన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థల సరసన నిలబెట్టాలన్నది మా ఆశయం’’ అన్నారు సత్యనారాయణ బొక్క. ఆయన సమర్పణలో మోహన్‌బాబు, శర్వానంద్‌ల ‘రాజు మహరాజు, అర్ధనారి’ సిన్మాల ఫేమ్‌ భానుశంకర్‌ చౌదరి దర్శకత్వంలో వై.వి. కంబైన్స్‌ పతాకంపై హితేశ్‌ బొక్క ఓ సినిమా నిర్మించనున్నారు.

శనివారం ఈ సంస్థ లోగోను ఆవిష్కరించిన దాసరి అరుణ్‌కుమార్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మంచి కథను అందించమని భానుశంకర్‌ను కోరాను. ఎనిమిది నెలలుగా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఆల్రెడీ నటీనటుల ఎంపిక పూర్తయింది. త్వరలో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తాం’’ అన్నారు సత్యనారాయణ బొక్క. ‘‘నిర్మాతలు లేకపోతే చిత్రపరిశ్రమ మనుగడ లేదు. అందుకే, నిర్మాత పరిచయంతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టా. త్వరలో చిత్రాన్ని ప్రారంభించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు భానుశంకర్‌. చిత్రనిర్మాత హితేశ్‌ బొక్క, భాను తదితరులు పాల్గొన్నారు.