నేటి నుంచి గోవాలో సినిమా పండుగ

19 Nov, 2014 23:05 IST|Sakshi
నేటి నుంచి గోవాలో సినిమా పండుగ

 ఇవాళ్టి నుంచి మరో పెద్ద సినిమా పండుగకు రంగం సిద్ధమైంది. 45వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ - ఇఫీ)కి గోవా పట్టణం ముస్తాబైంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, అలాగే దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌లు ఈ చలనచిత్రోత్సవ ప్రారంభానికి హాజరవుతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి అమితాబ్ ముఖ్య అతిథి కాగా, ఈ ఏటి భారతీయ సినీ ప్రముఖుడిగా శతవసంత అవార్డును రజనీకాంత్‌కు అందించనున్నారు. ఈ 30వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 75 దేశాలకు చెందిన 179 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ‘ప్రపంచ సినిమా’, ‘మాస్టర్ స్ట్రోక్స్’, ‘ఫెస్టివల్ కలైడోస్కోప్’, ‘సోల్ ఆఫ్ ఏషియా’, ‘డాక్యుమెంటరీలు’, ‘యానిమేటెడ్ చిత్రాల’ అనే వివిధ విభాగాల కింద ఈ చిత్ర ప్రదర్శనలు జరగనున్నాయి. ఇక, ‘రెట్రాస్పెక్టివ్’ విభాగం కింద గుల్జార్, జహ్నూ బారువా లాంటి ప్రసిద్ధుల సినిమాలనూ, అలాగే ప్రత్యేక సంస్మరణగా రిచర్డ్ అటెన్‌బరో (‘గాంధీ’ చిత్ర దర్శకుడు), రాబిన్ విలియమ్స్, జోహ్రా సెహ్‌గల్, సుచిత్రాసేన్, ఫరూఖ్ షేక్‌ల చిత్రాలనూ చూపనున్నారు.
 
 పనోరమాలో తెలుగు చిత్రాలకు దక్కని చోటు...
 ఇక, మన దేశంలోని వివిధ భాషా చిత్రాలకు కీలకమైన ‘ఇండియన్ పనోరమా’ విభాగంలో మొత్తం 26 ఫీచర్ ఫిల్ములనూ, 15 నాన్-ఫీచర్ ఫిల్ములనూ ప్రదర్శించనున్నారు. ‘పరంపర’, ‘గీతాంజలి’, ‘ఆ అయిదుగురు’, ‘ప్రభంజనం’, నీలకంఠ ‘మాయ’, రామ్‌గోపాల్ వర్మ ‘రౌడీ’, అక్కినేని నటించిన ‘మనం’ తదితర 11 చిత్రాలు ఎంట్రీకి పోటీపడ్డాయి. కానీ, ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ఏ.కె. బీర్ నిర్దేశకత్వంలోని కమిటీ ఎంపిక చేసిన చిత్రాలలో ఒక్క తెలుగు చిత్రం కూడా ఎంపిక కాలేదు. మలయాళ, మరాఠీ చిత్రాలు ఏడేసి చొప్పున, బెంగాలీ చిత్రాలు 5, హిందీ చిత్రాలు 2, అస్సామీ, కన్నడ, ఖాసీ, ఒడియా, తమిళ చిత్రాలు ఒక్కొక్కటి వీటిలో ఉన్నాయి. వీటిలో మలయాళ చిత్రం ‘దృశ్యం’ కూడా ఉంది. ఈ భారతీయ భాషా చిత్రాల నుంచి ఎంపిక చేసిన రెండు సినిమాలు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అనేక ఇతర ఎంట్రీలతో కలసి ‘ఇఫీ’లో పోటీపడతాయి. ఈ ఏడాది ఉత్సవంలో అతిథి దేశంగా చైనాను ఎంచుకున్నారు. భారత, చైనాల మధ్య సాంస్కృతిక సమన్వయానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు.
 
 28న ‘చదువుకోవాలి’...    
 కాగా, ‘చదువుకుంటే వెలుగు... చదువుకుంటే కొలువు’ అనే నినాదంతో చదువు ఆవశ్యకతను చెబుతూ, జర్నలిస్టు మద్దాలి వెంకటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘చదువుకోవాలి’ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపనున్నారు. 28వ తేదీ సాయంత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
 
 ఈ దుఃస్థితికి కారణం అదే!
 ‘‘ఈ సారి ‘ఇండియన్ పనోరమా’లో స్థానం కోసం మలయాళం నుంచి 43, కన్నడం నుంచి 40, చివరకు అస్సామీ నుంచి కూడా 11 చిత్రాలు ఎంట్రీలుగా వచ్చాయి. అత్యధిక సంఖ్యలో చిత్రాలు నిర్మించే మన తెలుగు నుంచి 11 చిత్రాలే వచ్చాయి. మన చిత్రాలు మనకు బాగున్నాయనిపించినా, దేశవ్యాప్త ఎంట్రీల మధ్య నిలబడలేదన్నది చేదు నిజం. కోట్లు ఖర్చుపెట్టి, పరభాషా చిత్రాల్ని కొనుక్కొని నిర్మిస్తున్న మన సినిమాల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది. దాని మీద దృష్టి పెట్టకుండా, అవార్డుల జాబితాలో లేవని చింతిస్తే ఏం లాభం? సినిమా అంటే 4 డాన్సులు - 2 ఫైట్లు అనుకొనే దశ నుంచి మనం మారాలి. అప్పుడే మన సినిమాలకు గుర్తింపు సాధ్యం. కళాత్మక చిత్రాలు తీసే ఒకరిద్దరికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహమూ శూన్యం. అదే ఈ దుఃస్థితికి కారణం.’’
 - కె.ఎన్.టి. శాస్త్రి, ‘ఇండియన్ పనోరమా’ జ్యూరీ సభ్యుడు - జాతీయ అవార్డు చిత్రాల దర్శకుడు
 

>