ఐఫా-ఉత్సవం అదరహో..!

26 Jan, 2016 01:43 IST|Sakshi
ఐఫా-ఉత్సవం అదరహో..!

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ - ఐఫా ఉత్సవం (సౌత్) 2016 వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా సాగుతోంది. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందిస్తున్న ఈ ఉత్సవంకు గచ్చిబౌలిలోని ఔట్‌డోర్ స్టేడియమ్ వేదికగా నిలిచింది. తొలి రోజైన ఆదివారం తమిళ, మలయాళ సినీ పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రదానం ఆర్భాటంగా జరిగింది.
 
 సోమవారం రాత్రి పొద్దుపోయే సమయానికి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు తదితర అనేక విభాగాల్లో అవార్డుల ప్రదానం జోరుగా సాగుతోంది. అవార్డుల ప్రదానానికి ముందు అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉల్లాసంగా గ్రీన్ కార్పెట్ మీదుగా నడుచుకుంటూ సభా ప్రాంగణంలోకి వచ్చారు. అగ్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు.
 
 రాత్రి 9:30 గంటలకు అవార్డుల వేడుక ప్రారంభమైంది. ముందుగా నటి కల్పన మృతికి సంతాపంగా సభికులందరూ ఒక నిమిషం మౌనం వ హించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభోపన్యాసం చేశారు. హీరోలు అల్లు శిరీష్, నవదీప్, హీరోయిన్ రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ప్రభుదేవా, శ్రీయా, భరత్ కొన్ని తమిళ హిట్ పాటలకు డ్యాన్స్ చేశారు. అనంతరం నేపథ్య గాయని విభాగంలో ‘బాహుబలి’ చిత్రంలోని ‘ఒడి బాహుబలి’ పాట పాడిన ‘సత్యయామిని’కి నిర్మాతలు కేఎస్ రామారావు, సి.అశ్వినీదత్ అవార్డు అందించారు.
 
 ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డును ‘శ్రీమంతుడు’ చిత్రంలోని ‘జతకలిసే’ పాటకు సాగర్ అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా ‘శ్రీమంతుడు’ చిత్రంలోని ‘రామ రామ’ పాటకు రామజోగయ్య శాస్త్రి పురస్కారం అందుకున్నారు. అక్కినేని స్మారక పురస్కారాన్ని నాగార్జున, అమల, నాగ సుశీల, సుమంత్ అందుకున్నారు. తెలుగు సినిమా అవార్డులతో పాటు కన్నడ చిత్రాలకు కూడా పురస్కారాలను అందించారు. కన్నడ సినిమా అవార్డులకు విజయ్ రాఘవేంద్ర, అకుల్ బాలాజీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
 
 ఈ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా, నాని, వివేక్ ఒబెరాయ్ తదితర హీరోలతో పాటు దర్శకులు కె.రాఘవేంద్రరావు, కొరటాల శివ, వీర శంకర్, నిర్మాతలు నిమ్మనగడ్డ ప్రసాద్, కేఎల్ నారాయణ, ‘దిల్’ రాజు వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
 
 సినీ ప్రముఖులతో రోజంతా సదస్సు
 సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా హైదరాబాద్‌లో సినీ రంగంపై ‘ఫిక్కీ - ఐఫా’ సదస్సు సాగింది. ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) నిర్వహించిన ఈ సదస్సు సినిమా, వినోద రంగాల్లో వ్యాపార అవకాశాల కల్పన అంశంపై ప్రధానంగా దృష్టి నిలిపింది. తెలంగాణ  ఐ.టి. శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రభుత్వ సలహాదారు బి.వి. పాపారావు సహా పలువురు ప్రభుత్వ అధికారులు ఈ సదస్సుకు విచ్చేశారు.

 సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఉత్తరాది నుంచి అగ్ర నిర్మాత రమేశ్ సిప్పీ, దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తదితరులు ప్రత్యేకంగా హాజరయ్యారు. సదస్సులో ‘ప్రసాద్’ గ్రూప్ అధినేత ఎ. రమేశ్‌ప్రసాద్, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, ‘దిల్’ రాజు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, శరత్‌మరార్,  కె. రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 
 వినోద పరిశ్రమకు కార్యస్థానంగా హైదరాబాద్, డిజిటల్ కంటెంట్, తెలంగాణలో ఫిల్మ్ టూరిజమ్ తదితర వివిధ అంశాలపై నిపుణులు చర్చించారు. ప్రసిద్ధ ఆడియోగ్రాఫర్ - ఆస్కార్ అవార్డు విజేత అయిన రసూల్ పూకుట్టి, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు పి.సి. సనత్, యానిమేషన్ రంగానికి చెందిన రాజీవ్ చిలకా తదితరులు  ఈ చర్చల్లో పాల్గొన్నారు.