రెండు రోజులు... ఐ-ఫీస్ట్

22 Jan, 2016 23:44 IST|Sakshi
రెండు రోజులు... ఐ-ఫీస్ట్

‘‘పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్...’’ అంటూ సిల్వర్ స్క్రీన్‌పై శ్రీయ నర్తిస్తుంటే కళ్లప్పగించి చూసేస్తాం..
‘‘ఏం సక్కగున్నావ్‌రో నా సొట్ట సెంపలోడ’’ అంటూ తాప్సీ డ్యాన్స్ చూస్తే అదో ఐ-ఫీస్ట్...

 
తెరపై వీళ్ల డ్యాన్స్ చూసినప్పుడే పసందుగా ఉంటే, ఇక డెరైక్ట్‌గా స్టేజిపై డ్యాన్స్ చేస్తేచూడ్డానికి రెండు కళ్లూ చాలవు. శ్రీయ, తాప్సీ, నిక్కీ గల్రానీ.. ఇలా భాషాభేదం లేకుండా పలువురు కథానాయికలు కనువిందు చేయబోతున్న వేడుక ‘ఐఫా- ఉత్సవమ్’. జియోవన్ స్మార్ట్‌ఫోన్, రేనాల్ట్‌ల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ను అందిస్తోంది. దశాబ్దన్నర పైగా కేవలం హిందీ చలనచిత్ర పరిశ్రమకే ఈ అవార్డులు పరిమితమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా దక్షిణాది సినిమాలకు అవార్డులివ్వాలని ‘ఐఫా’ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు.

ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకల్లో పలువురు ప్రముఖ తారలు తమ నృత్యాలతో అలరించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో మమతా మోహన్‌దాస్, శ్రీయ, తాప్సీ, నిక్కీ గల్రానీ, పారుల్ యాదవ్ బిజీ బిజీగా రిహార్సల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నృత్య కళాకారుడు షియామక్ దావర్ ఆధ్వర్యంలో డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతోంది. ప్రాక్టీస్ బ్రేక్‌లో ‘సాక్షి’తో తారలు ముచ్చటించారు. ఆ విశేషాలు...
 
ఈ వేడుక  నాకు చాలా ప్రత్యేకం  
- శ్రీయ
‘‘దక్షిణాదివారికి ఐఫా అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి. సౌతిండియాలోనే పెద్ద వేడుక ఇది. అదో ఆనందం అయితే ఈ వేడుక  హైదరా బాద్‌లో జరగడం మరో ఆనందం. ఈ వేడుక నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ప్రభుదేవాతో కలిసి 45 సెకన్ల పాటు డ్యాన్స్ చేయబోతున్నాను. అంత టాలెంటెడ్ డ్యాన్సర్‌తో స్టేజ్ షేర్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను షియామక్ దావర్ దగ్గర డ్యాన్స్ క్లాసులకు వెళ్లేదాన్ని. ఇప్పుడీ వేడుకలకు ఆయన దగ్గర మళ్లీ నేర్చుకోవడం ఓ మంచి అనుభూతి. ఆయన ట్రెడిషనల్ బుక్స్ చదువుతుంటారు. నాక్కూడా ఇస్తుంటారు. నేను డ్యాన్స్ చేయబోయే పాటల్లో ‘వాజి... వాజి... వాజి.. శివాజీ’, ‘మన్మథ.. మన్మథ...’ మొదలైన సూపర్ హిట్స్ ఉన్నాయి.
 
నాతో డ్యాన్స్ చేయనుంది నా టీచర్లే!  
- తాప్సీ
ఈ వేడుక గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అంత ఎగ్జయిటింగ్‌గా ఉంది. నేను సినిమాల్లో బాగా డ్యాన్స్ చేస్తున్నానంటే షియామక్ దావర్ కారణం. ఆయన దగ్గర ఆరేళ్లు ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడీ వేడుకలో నా వెనకాల గ్రూప్ డ్యాన్స్ చేసేవాళ్లందరూ నా టీచర్లే కావడం విశేషం. నా గురువులకూ, ఐఫాకీ గర్వకారణంగా నిలిచేలా డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను. ఎంతోమంది ప్రముఖులు పాల్గొననున్న ఈ వేడుక నాకు మరపురాని అనుభూతి అవుతుంది.
 
హేమాహేమీలతో డ్యాన్స్ చేయనున్నా
- నిక్కీ గల్రానీ
ఇప్పటివరకూ మలయాళంలో నాలుగు, కన్నడంలో నాలుగు, తమిళంలో రెండు సినిమాల్లో నటించాను. ప్రస్తుతం తెలుగులో ‘కృష్ణాష్టమి’ సినిమా చేస్తున్నాను. ఈ వేదికపై డ్యాన్స్ చేయబోతున్నవాళ్లందరూ హేమాహేమీలే. వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయనుండటం నాకో అందమైన కల నెరవేరినట్లుగా ఉంటుంది. మొత్తం నాలుగు పాటలకు డ్యాన్స్ చేయబోతున్నాను. నా చిన్నప్పుడు షియామక్ దావర్ గురించి చెబుతుంటే వినేదాన్ని. ఆయన కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉంది.

>