సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి

5 Feb, 2019 00:11 IST|Sakshi
ఇళయరాజాను సత్కరిస్తున్న భాగ్యరాజా, నాజర్, విశాల్‌...

– ఏఆర్‌ రెహమాన్‌

సంగీత జ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇళయరాజా 75’ పేరుతో గత శని, ఆదివారాల్లో చెన్నైలో ఘనంగా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను తమిళ నిర్మాతల మండలి నిర్వహించింది. ఈ వేడుకలోని హైలెట్స్‌...

► ఇళయరాజాగారితో ఉన్న అనుబంధం గురించి రెహమాన్‌ మాట్లాడుతూ – ‘‘నేను రాజాగారి దగ్గర పని చేసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ‘మూండ్రామ్‌ పిరై’ (వసంత కోకిల) సినిమాకు రాజాసార్‌ టీమ్‌లో జాయిన్‌ అయ్యాను. రాజాగారు రికార్డింగ్‌ స్టూడియోలోకి ప్రవేశిస్తుంటే ,హెడ్‌ మాస్టర్‌ క్లాస్‌రూమ్‌లోకి వస్తున్న భావన కలిగేది.  ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి’’ అన్నారు.

► ఈ కార్యక్రమానికి సీనియర్‌ నటి, మణిరత్నం భార్య సుహాసిని యాంకర్‌గా వ్యవహరించారు. ‘రెహమాన్‌ మిమ్మల్ని గురువు అన్నారు. దాని గురించి ఏదైనా పంచుకుంటారా?  అని ఇళయరాజాని ఆమె అడగ్గా– ‘‘రెహమాన్‌ తన తండ్రి దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉన్నాడు. కరెక్టే కదా (రెహమాన్‌ వైపు చూస్తూ). దానికి రెహమాన్‌ అవును అన్నారు. ‘ఈ విషయాలన్నీ నువ్వు (రెహమాన్‌) చెప్పాలి’ అని సరదాగా పేర్కొన్నారు.  మరో యాంకర్‌గా వ్యవహరించిన నటి కస్తూరి.. రెహమాన్‌ కంపోజ్‌ చేసిన ఏదైనా పాటను పాడమని అడగ్గా ఇళయరాజా ‘మౌనరాగం’ చిత్రంలోని ‘మండ్రం వంద తెండ్రులుక్కు.’ అనే పాటను ఆలపించారు. అదే సమయంలో కీబోర్డ్‌ దగ్గర ట్యూన్‌ చేస్తున్న రెహమాన్‌.. సంగీతజ్ఞాని పాట వింటూ ఆగిపోయారు. ‘ఏమైంది?  ట్యూన్‌ సరిగ్గా గుర్తులేదా? ’ అంటూ రాజా చమత్కరించారు.

► రజనీకాంత్‌ మాట్లాడుతూ – ‘‘ఇళయరాజా స్వయంభూలింగం. ధోతి ధరించకముందు వరకూ సార్‌ అని పిలిచేవాణ్ని. ఆ తర్వాత నుంచి స్వామి అంటున్నాను. రాజాగారు కూడా నన్ను అలానే పిలుస్తారు. నాకంటే కమల్‌కు మంచి సంగీతాన్ని అందించారు’’ అని రజనీ అంటుండగా, ఇళయరాజా అందుకుంటూ ‘కమల్‌హాసనేమో మీకు మంచి మ్యూజిక్‌ ఇచ్చాను అంటుంటారు. నాకు యాక్టర్‌ ఎవరన్నది కాదు. ఏ పాటకైనా నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’’   అన్నారు.

► కమల్‌ హాసన్‌ ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌ స్టేజ్‌ మీద మూడు పాటలు పాడి,  ఇళయరాజాతో ఉన్న అనుబంధాన్ని షేర్‌ చేసుకున్నారు.  ‘‘నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు రాజాగారు సలహాలిచ్చారు’’ అన్నారు   కమల్‌.

► ‘‘సంగీతానికి ఒకరే రాజు. ఆయనే ఇళయరాజా. లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్తున్నప్పుడు బండిలో పెట్రోల్‌ ఉందా లేదా అని చూసుకోవడం కంటే ముందు ఇళయరాజా పాటలున్నాయా? లేదా ? అని చెక్‌ చేసుకుంటారు. ఇలాంటి లెజెండ్స్‌ను సన్మానించుకోవడం మా బాధ్యత. ఇండస్ట్రీలోని వాళ్లకోసం ఇండస్ట్రీ వాళ్లం ఈవెంట్స్‌ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాను. ఈ వేడుక చరిత్రలో మిగిలిపోతుంది. అలాగే దీన్ని వ్యతిరేకించినవాళ్లు కూడా చరిత్రలో ఉంటారు’’ అని పేర్కొన్నారు నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్‌.


రెహమాన్, ఇళయరాజా


శ్రుతీహాసన్, కమల్‌హాసన్‌


కమల్, రజనీ

మరిన్ని వార్తలు