జూన్‌ 4న తీర్పు

1 May, 2019 08:28 IST|Sakshi

చెన్నై ,పెరంబూరు: సంగీతదర్శకుడు ఇళయరాజా కాపీరైట్స్‌ పిటిషన్‌పై తుది తీర్పును జూన్‌ 4న వెల్లడించనున్నట్లు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. సుమారు 1000కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఇళయరాజా 4,500కు పైగా పాటలకు స్వరపరచారు. ఈయన తన పాటలను తన అనుమతి లేకుండా, కాపీరైట్స్‌ పొందకుండా సంగీత కచేరీలు వంటి పలు కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాపీరైట్స్‌ చట్టం ప్రకారం తన పాటలను వాడుకోవడానికి తనకు సొమ్ము చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ విధంగా 2014లో మలేషియాకు చెందిన అగ్ని మ్యూజిక్, ఏకో రికార్డింగ్, గిరి వర్ధక సంస్థలపై కాపీరైట్స్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో ఏకో సంస్థ నిర్వాహకులు మద్రాసు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. అందులో ఇళయరాజా పారితోషికం తీసుకునే సంగీతాన్ని అందిస్తున్నారని, కాబట్టి ఆయనకు కాపీరైట్స్‌ ఉండవని, చిత్ర నిర్మాతలకే ఆ రైట్స్‌ ఉంటాయని వాదించారు. దీంతో ఇళయరాజా కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు పాటలకు సంబంధించి కాపీ చట్టం ప్రకారం తమకు వాటా ఉంటుందని కోరుతున్నారు. కాగా ఏకో సంస్థ దాఖలు చేసిన పిటిష¯న్‌పై విచారించిన న్యాయస్థానం ఇళయరాజా పిటిషన్‌ను కొట్టివేసినా, ఇతర రికార్డింగ్‌ సంస్థలపై కేసు విచారణలోనే ఉంది. ఇప్పుడీ కేసుపై తుది తీర్పును జూన్‌ 4న వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి అనితా సుమంత్‌ తెలిపారు. బుధవారం నుంచి వేసవి సెలవులు మొదలు కావడంతో ఇప్పుడు తీర్పును వెల్లడించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు