ఇళయరాజా ఫొటో ఎగ్జిబిషన్

25 Jan, 2014 00:51 IST|Sakshi
ఇళయరాజా ఫొటో ఎగ్జిబిషన్

 ‘నా ఫొటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ అంటూ ఇళయరాజా ఓ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ సంగీతస్రష్టకి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే, కంటికి నచ్చినవాటిని తన కెమెరాలో బంధిస్తుంటారు. ఇప్పటివరకు ఐదువేల ఫొటోలకు పైగా తీశారు ఇళయరాజా. కానీ, ఇంతకుముందు తీసినట్లుగా ఇప్పుడు ఫొటోగ్రఫీ మీద ఆయనకు ఆసక్తి లేదు. ఎందుకంటే, ఫిల్మ్‌రోల్‌లో తీసిన ఫొటోలతో పోలిస్తే డిజిటల్ కెమెరాలతో తీసిన ఫొటోల్లో అంత డెప్త్ ఉండటంలేదని ఆయన అంటున్నారు. డిజిటల్‌ని ఆవిష్కరించడం ద్వారా ఓ అద్భుతాన్ని నాశనం చేసినట్లుగా ఆయన భావిస్తున్నారు. 1978లో ఇళయరాజా ఫొటోలు తీయడం మొదలుపెట్టారు.
 
  ప్రకృతి అందాలను ఫొటో తీయడం ఆయనకు చాలా ఇష్టం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫొటోలు తీస్తుంటారు. తన ఫొటోల్లో ‘జీవం’ ఉంటుందని ఆయన అంటున్నారు. ఓసారి బెంగళూరులో ఓ చిన్నపిల్ల ఏడుస్తుంటే ఫొటో తీశారట ఇళయరాజా. ఆ పాప ఏడుస్తున్న దృశ్యం తనను కదిలించడంవల్లే కెమెరాని క్లిక్‌మనిపించానని పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌తోపాటు ఇతర నగరాల్లోనూ, దుబాయ్, సింగపూర్, లండన్‌లోనూ తను తీసిన ఛాయాచిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. ఇప్పటివరకు ఎన్నో కెమెరాలను కొనుక్కున్నారు ఇళయరాజా. వాటిని చాలా పదిలంగా దాచుకున్నారట. దాన్నిబట్టి ఈ స్వరమాంత్రికుడికి ఫొటోగ్రఫీ అంటే ఎంత మమకారమో అర్థం చేసుకోవచ్చు.