శంకర్‌కు ఇళయరాజా నోటీస్

4 Jan, 2015 08:06 IST|Sakshi
శంకర్‌కు ఇళయరాజా నోటీస్

ప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా, అగ్రదర్శకుడు శంకర్‌ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోందని చెప్పాలి. ‘కప్పల్’ చిత్రంలో అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నారంటూ శంకర్‌కు ఇళయరాజా తన న్యాయవాది ద్వారా నోటీసు పంపించారు. వివరాల్లో కెళితే శంకర్ శిష్యుడు కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కప్పల్’. ఐ స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో వైభవ్, సోనమ్ నాయకా నాయికలుగా నటించారు. దర్శకుడు శంకర్ తన ఎస్. పిక్చర్స్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో ఇళయరాజా బాణీ కట్టిన ‘ఊరు విట్టు ఊరు వందు, కాదల్ గీదల్ పణ్ణాదింగా...’ అనే పాటను వాడుకున్నారు. ఈ పాటను ఇళయరాజా చాలా ఏళ్ళ క్రితం ‘కరగాటక్కారన్’ చిత్రం కోసం రూపొందించారు.
 
 ఈ పాటను తన అనుమతి లేకుండా ‘కప్పల్’ చిత్రంలో ఎలా వాడుకుంటారని శంకర్, దర్శకుడు కార్తీక్ జి.క్రిష్, చిత్ర ఒరిజినల్ నిర్మాత జయరాంలకు ఆయన తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తాను సంగీతం అందించిన చిత్రాల పాటలను తన అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించరాదని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందని అందులో ఆయన అన్నారు. కాబట్టి, ‘ఊరువిట్టు ఊరు వందు...’ పాటను ‘కప్పల్’ చిత్రంలో వాడటం కోర్టు ధిక్కార చర్య అవుతుందన్నారు. ఇలా తన పాటను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు పరిహారం చెల్లించాలని, వెంటనే ఆ పాటను ‘కప్పల్’ చిత్రం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. లేదంటే కోర్టులో క్రిమినల్, సివిల్ కేసులు పెట్టనున్నట్లు హెచ్చరించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి