అన్నీ చెప్పేస్తే...ఇంకేం ఉంటుంది!

26 Oct, 2015 01:03 IST|Sakshi
అన్నీ చెప్పేస్తే...ఇంకేం ఉంటుంది!

 ‘‘నాకెలా నచ్చితే అలా ఉంటా.. ఏది అనిపిస్తే అది ఓపెన్‌గా చెప్పేస్తా. పొగడ్తలంటే అసహ్యం. ఉచిత సలహాలిస్తే అస్సలు నచ్చదు’’ అంటున్నారు ఇలియానా. ఈ గోవా బ్యూటీకి నచ్చని, నచ్చే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 
నేను హీరోయిన్‌ని కాబట్టి ఇరవైనాలుగు గంటలూ ఎంటర్‌టైన్ చేయాలనుకుంటే నా వల్ల కాదు. కెమెరా కోసం మాత్రమే నటిస్తాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఎంత న్యాయం చేయాలో అంతా కెమెరా ముందు చేసేస్తాను. ఆ తర్వాత ఇతరుల ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ఆలోచించను. నా గురించి ఆలోచించుకుంటాను.
 
నేను చాలా ఫ్రెండ్లీ పర్సన్‌ని. నా ఫ్రెండ్‌షిప్‌ని ఇతరులు ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకుంటాను. ఒకవేళ ఇష్టపడకపోతే వాళ్లతో బలవంతంగా స్నేహం చేయను.

ఈ ప్రపంచంలో ఎంత బెస్ట్ పర్సన్ అయినా, అందర్నీ మెప్పించలేరు. ఎక్కడో చోట ఎవరో ఒకర్ని నిరుత్సాహపరుస్తారు. అది సహజం. అందుకే అందర్నీ మెప్పించడానికి ట్రై చేయను. ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను.

నా వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడను. అన్ని విషయాలూ చెప్పేస్తే ఇంకేముంటుంది? అందుకే కొన్నయినా దాచుకుంటా.
 ఒకరి కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను. నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అలా ఉండటం తప్పు అని ఎవరైనా అంటే కేర్ చేయను.

నేను అందంగా ఉండనని నా ఫీలింగ్. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలా ఉండననుకుంటాను. అమ్మాయి దేహంలోకి బలవంతంగా ఇరికించిన అబ్బాయినేమో అనిపిస్తుంటుంది.

సోషల్ నెట్‌వర్క్ అంటే ఇష్టం. ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా అందరితోనూ టచ్‌లో ఉండొచ్చు.

నేను పార్టీ యానిమల్‌ని కాదు. ముఖ్యంగా హాట్ డ్రింక్స్ తీసుకునేవాళ్ల మధ్యలో ఉండటానికి ఇష్టపడను. ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు అక్కడున్నవాళ్లు మాట్లాడుతున్నంతసేపూ హాయిగా మాట్లాడతాను. మద్యం పుచ్చుకోబోతున్నారని తెలియగానే అక్కణ్ణుంచి వెళ్లిపోతా.

యాక్చువల్‌గా ఫొటోగ్రాఫర్స్ కనిపించగానే మొహం మీద చిరునవ్వు పులుముకుని పోజులిచ్చే టైప్ కాదు నేను. కెరీర్ ఆరంభించిన మొదట్లో చాలా ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత తర్వాత వృత్తిలో ఇది కూడా భాగమే అని సర్ది చెప్పుకున్నా. అప్పట్నుంచీ ఫొటోలకు పోజులివ్వడం పెద్ద ఇబ్బందిగా అనిపించడంలేదు.

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హద్దులు దాటడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా చొరవ తీసుకోవాలనుకుంటారు. అలాంటివాళ్లకు వీలైనంత దూరంగా ఉంటాను.