'బుల్లితెరకు గుడ్ బై చెప్పే ప్రసక్తే లేదు'

17 Jul, 2014 19:05 IST|Sakshi

న్యూఢిల్లీ: మూడు సంవత్సరాల తరువాత మళ్లీ బుల్లి తెరపై కన్పించడానికి సిద్ధమవుతున్నాడు టీవీ, సినీ నటుడు కరణ్ కుంద్రా.  తనను ఈ స్థాయికి తెచ్చిన బుల్లితెరకు పుల్ స్టాప్ పెట్టే యోచనే లేదంటున్నాడు.  నిరంతరం షూటింగ్ లతో బిజీగా ఉండే  కరణ్ స్మాల్ స్ర్కీన్ అంటే అత్యంత ఇష్టమన్నాడు. 'నేను ఎప్పటికీ ప్రపంచ టెలివిజన్ ను విడిచిపెట్టను. ఆ టెలివిజన్ షోలతోనే నాకు గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ లో నాకు బ్రేక్ రావడానికి కూడా అదే కారణం'అని స్పష్టం చేశాడు.

 

'నేను ఒక ప్రయాణికుడ్ని. ఒకచోట ఉండను. నేను కేవలం ముంబైకి మాత్రమే పరిమితం కాదు.నెలలోని ముప్ఫై రోజులూ షూటింగ్ లోనే ఉంటాను'అని తెలిపాడు. ఇందుకోసం తాను ఉదయం 7 గం.లకు లేచి షూటింగ్ కోసం ముంబైను ఆనుకుని ఉన్న బయటప్రాంతాలకు వెళుతుంటానన్నాడు. అక్కడ షూటింగ్ కు పెద్ద ఖర్చు కాదన్నాడు. తనకు షూటింగ్ అనేది రోజు వారీ కార్యక్రమం అని తెలిపాడు. ప్రతీ రోజూ 15 గంటలపాటు షూటింగ్ లోనే ఉంటానన్నాడు. హారర్ మూవీలు, టీవీ సీరియల్స్ తీసే విక్రమ్ భట్.. ‘హారర్ స్టోరీ’, ‘ఆహట్’ వంటివాటిలో కరణ్ కుంద్రా నటించాడు. ప్రస్తుతం 'కితనీ మొహబ్బత్ హై' లో నటించేందుకు సిద్ధమైయ్యాడు.