చుక్కలు చూపించిన 14వ అంతస్తు

29 Oct, 2013 23:43 IST|Sakshi
 ఆ అందమైన భవంతి పేరు ‘ఎమ్‌ఐ6’. లండన్‌లోని థేమ్స్ నదీ తీరాన ఉందా భవంతి. భద్రతా కారణాల దృష్ట్యా ఎవర్ని పడితే వాళ్లని అందులోకి అనుమతించరు. కానీ, దర్శకుడు సాజిద్‌ఖాన్ తన పరపతిని ఉపయోగించి అనుమతి సంపాదించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘హమ్‌షకల్స్’ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఆ భవంతిలో చిత్రీకరించాలనుకున్నారాయన. సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, రామ్‌కపూర్, బిపాసా బసు, తమన్నా, ఇషా గుప్తా ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది.
 
  వీళ్ల కాంబినేషన్‌లోనే సీన్స్ తీయాలనుకున్నారు. ఎమ్‌ఐ6లోని 14వ అంతస్తులో సన్నివేశాల చిత్రీకరణకు మొత్తం రంగం సిద్ధమైంది. ఇక, యూనిట్ సభ్యులందరూ ఆ అంతస్తుకి చేరుకోవాలన్నమాట. అందరూ హుషారుగా లిఫ్ట్ దగ్గరకు వెళ్లారు. కట్ చేస్తే... ‘దిస్ లిఫ్ట్ ఈజ్ అండర్ మెయిన్‌టెనన్స్’ అనే బోర్డ్ వెక్కిరించింది. ఇక, గులాబీ బాల తమన్నా, బ్లాక్ బ్యూటీ బిపాసా బసు, క్యూట్ గాళ్ ఇషా గుప్తా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎత్తు మడమల చెప్పులతో 14 అంతస్తులు ఎక్కలేమని ఈ లలనామణులు భావించారు.
 
  చేసేదేముంది? ఒక చేత్తో చెప్పులు పట్టుకుని, ఆయాస పడుతూ గమ్యం చేరుకున్నారు. సైఫ్, రితేష్ తదితరులకూ ఈ భవంతి ఓ రేంజ్‌లో చుక్కలు చూపించిందట. ఆయాసం తీరి, కొంచెం కూల్ అయిన తర్వాత ఇదిగో... ఇక్కడ ఫొటోలో ఉన్నట్లు నవ్వులు చిందించిందీ బృందం. ఇదిలా ఉంటే.. ‘హిమ్మత్‌వాలా’తో బాలీవుడ్‌కి బాగా దగ్గరైన తమన్నా ప్రస్తుతం ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది పూర్తయ్యేలోపు ‘హమ్‌షకల్స్’లో అవకాశం రావడం, అందులోనూ మంచి పాత్ర చేస్తుండటం తమన్నాకి డబుల్ ధమాకాలా ఉందట.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి