వయసు 61.. ఫ్రాక్చర్లు 34!

17 Jul, 2016 23:14 IST|Sakshi
వయసు 61.. ఫ్రాక్చర్లు 34!

మెట్ల మీద నుంచి దిగుతూ ఇటీవల కమల్‌హాసన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. లెక్కల్లో చెప్పాలంటే ఇది 34వ ఫ్రాక్చర్. కమల్ వయసు 61. సో.. ఆయనకైన గాయాల లెక్క వయసులో సగానికి పైనే. ఎక్కువగా షూటింగుల్లోనే కమల్ ప్రమాదాల బారిన పడ్డారు. దాదాపు 20 ఏళ్ల క్రితం అయిన ఫ్రాక్చర్‌తో పోల్చితే ఇప్పుడైన ఫ్రాక్చర్ చాలా చిన్నదట. అప్పట్లో ‘కలైజ్ఞన్’ అనే సినిమా కోసం యాక్షన్ తీస్తున్నప్పుడు కమల్‌కి పెద్ద ప్రమాదమే జరిగింది. వేగంగా కారు ఢీ కొనడంతో పైకి ఎగిరి, ఆ కారు మీద పడి, ఆ తర్వాత కిందపడ్డారట కమల్.

దవడ ఎముక స్థానం మారడంతో పాటు, ముక్కుకి గాయం అయింది. అలాగే మూడు ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి. వెన్నెముకకు బలంగా దెబ్బ తగలింది. దాంతో ఇక జీవితంలో నడవలేనని కమల్ అనుకున్నారట. అదృష్టవశాత్తు అలా జరగలేదు. హిందీ చిత్రం ‘ముంబయ్ ఎక్స్‌ప్రెస్’ అప్పుడు జరిగినది కూడా పెద్ద ప్రమాదమే. ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ని కూర్చోబెట్టుకుని మోటార్ సైకిల్ నడిపే సీన్ తీస్తున్నప్పుడు హఠాత్తుగా వాహనం తలకిందులైందట. ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌కి ఏం కాకూడదనుకుని బండి భారాన్ని మోయడంతో పాటు, ఆ చిన్నారిని సేఫ్‌గా పట్టుకున్నారట కమల్.

అప్పుడు కూడా కమల్‌కి బాగా దెబ్బలు తగిలాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ చేసిన రిస్కులు చాలానే ఉన్నాయి. ఆయన ఇలా రిస్కులు తీసుకోవడానికి ఓ కారణం హాలీవుడ్ నటుడు స్టీవ్ మెక్ క్వీన్. ‘‘మనకు మంచి దేహ దారుఢ్యం ఉన్నప్పుడు డూప్ ఎందుకు? ఏ రిస్క్ అయినా మనమే చేయాలి’’ అన్నది స్టీవ్ పాలసీ. దాన్నే ఫాలో అవుతున్నానని కమల్ పేర్కొన్నారు. ‘‘విజయాలు, ప్రమాదాలు నాకు కొత్త కాదు. ఇప్పుడు జారి పడిన సంఘటనను తేలికగా తీసుకుంటున్నా. నా చుట్టూ మంచి వైద్యులు ఉన్నారు. వాళ్ల సహాయం, నా చిన్ని కుటుంబం ప్రేమ, అభిమానుల మమకారం వల్ల త్వరగానే కోలుకుంటా’’ అని కమల్ తెలిపారు.