మనస్ఫూర్తిగా నచ్చి చేశా...

18 Oct, 2014 01:11 IST|Sakshi
మనస్ఫూర్తిగా నచ్చి చేశా...

‘‘ఇటీవల సినిమాలు చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. పెద్ద తరహా పాత్రలు చేయమని చాలామంది అడుగుతున్నా, ఆ తరహా సినిమాల్లో నటించి ఉన్న పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒప్పుకోవడంలేదు. పూసల చెప్పిన కథ నచ్చి, మనస్ఫూర్తిగా నా పాత్ర నచ్చి, ఈ సినిమా చేశా’’ అని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ చెప్పారు. యశ్వంత్, మిత్ర జంటగా పూసల దర్శకత్వంలో బేబీ శ్రీక్రితి సమర్పణలో సత్యం నిర్మించిన ‘డాలర్‌కి మరో వైపు’ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

పూసల మాట్లాడుతూ -‘‘ఈ తరం వారికి అమెరికాపై ఉన్న మోజు, డాలర్లకు బానిసలవ్వడం, ఉమ్మడి కుటుంబంలోని ప్రేమానురాగాలు కరువవ్వడం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. నవంబరు మొదటి వారంలో పాటలను, అదే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా యశ్వంత్, మిత్ర, సందీప్తి తదితరులు మాట్లాడారు.