‘మహానటి’కి అభినందనల వెల్లువ

9 May, 2018 14:05 IST|Sakshi

సాక్షి, సినిమా: దేశం గర్వించదగిన మహానటి సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’  సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అద్భుతంగా నిజంగానే మహాద్భుతంగా ఉందటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్, జెమినీ గణేషన్‌గా దుల్కర్‌ సాల్మన్‌ జీవించారని అభినందనలు కురుస్తున్నాయి.

(చూడండి: ‘మహానటి’ మూవీ రివ్యూ)

28 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..: మహానటి విడుదల సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావ్‌ ఒకింత భావోద్వేగపూరిత కామెంట్లు చేశారు. ‘‘సరిగ్గా 28 ఏళ్ల కిందట ఇదే వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో నేను తీసిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ ఇదే రోజు(మే 9న) విడుదలైంది. మళ్లీ ఇప్పుడు ‘మహానటి’ లాంటి గొప్ప సినిమా వచ్చింది. సావిత్రి జీవితచరిత్రను సినిమాగా మలిచిన వైజయంతి మూవీస్‌కి అభినందనలు’’అని పేర్కొన్నారు.

ఫ్యాన్‌ అయిపోయా: జక్కన్న
‘‘ఏదో అనుకరిస్తున్నట్లు కాకుండా పాత్రల్లో అద్భుతంగా జీవించారు. కీర్తి సురేశ్‌.. సావిత్రిని మళ్లీ మనముందుకు సజీవంగా తీసుకొచ్చారు. ఇక దుల్కర్‌ సాల్మన్‌.. ఫెంటాస్టిక్‌! నేను అతనికి ఫ్యాన్‌ అయిపోయా. స్వప్నదత్‌, నాగ అశ్విన్‌లకు అభినందనలు’’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

సావిత్రి ఆత్మే చేయించుకుంది: విజయవాడలో ‘మహానటి’ సినిమా చూసిన అనంతరం నిర్మాత అశ్వినీ దత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘18 నెలల కష్టానికి ఫలితం దక్కింది. బహుశా సావిత్రిగారి ఆత్మే దగ్గరుండిమరీ ఈ సినిమాను చేయించుకుంది. నా 44 ఏళ్ల సినీ జీవితంలో అత్యంత సంతృప్తి ఇచ్చిన సినిమా ఇదే. ఓవర్సీస్‌లో ప్రభంజనం సృష్టించడం ఖాయం. సినిమాలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.

సావిత్రి కూతురి వ్యాఖ్య: మహానటి సావిత్రి కూతురు చాముండేశ్వరి సైతం తొలిరోజే ‘మహానటి’ని చూసి తన భావాలను పంచుకున్నారు.‘‘అమ్మ చిన్నతనం నుండి అగ్రకథానాయికగా ఎదిగిన తీరును సినిమాలో చూడటం ఆనందంగా ఉంది. అమ్మే నాలో ఉండి తన కథని ఇలా చిత్ర రూపంలో చేయించుకుంది. కీర్తి సురేష్ చక్కగా ఒదిగిపోయారు. దుల్కర్‌ సాల్మన్‌ అచ్చు మా నాన్నను అనుకరిస్తూ నటించారు.

మహానటిపై ప్రముఖుల ట్వీట్స్‌...

మరిన్ని వార్తలు