వడివేలుకు చుక్కెదురు

12 Jun, 2019 07:07 IST|Sakshi

చెన్నై ,పెరంబూరు: హాస్యనటుడు వడివేలుకు ఆదాయ పన్ను శాఖ కమిటీలో చుక్కెదురైంది. ఆయన ఆ కమిటీకి చేసుకున్న అప్పీల్‌ తిరస్కరణకు గురైంది. వివరాల్లోకి వెళ్లితే నటుడు వడివేలు ఆదాయ పన్ను శాఖకు సరైన లెక్కలు చూపకుండా పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అందడంతో ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆయనకు చెందిన చెన్నై, మదురైలో గల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వడివేలు నటుడిగా బిజీగా ఉన్న సమయంలో 2010లో తను సినిమాకు పారితోషికంగా రూ.4లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లు లెక్కలు చూపించాడు.

అయితే సోదాల్లో రూ.లక్ష రొక్కం, రూ.50 లక్షల విలువైన ఆస్తులకు లెక్కలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పన్ను ఎగవేతకు పాల్పడినందుకుగానూ రూ.61.23 లక్షల జరిమానా  చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. దీనిపై వడివేలు ఆదాయపన్ను శాఖ కమిటీలో అప్పీల్‌ చేసుకున్నాడు. అందులో.. తనకు నోటీసులు పంపడం సరికాదని, తనకు జారీ చేసిన జరిమానా నోటీసులను రద్దు చేయాల్సిందిగా కోరాడు. దీంతో ఆ కమిటీ వడివేలు అప్పీల్‌పై విచారణ జరపింది. అందులో వడివేలు ఆదాయపన్ను శాఖకు సరిగా పన్ను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డాడని రుజువు కావడంతో అతని అప్పీల్‌ను కొట్టివేసింది. దీంతో వడివేలు తనకు ఆదాయపన్ను శాఖ విధించిన రూ. 61.23 లక్షల జరిమానా చెల్లించి తీరాల్సిన పరిస్ధితి నెలకొంది. 

మరిన్ని వార్తలు