టాలీవుడ్‌లో ఐటీ దాడులు

21 Nov, 2019 04:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆదాయపన్నుశాఖ (ఐటీ) దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భాగ్యనగరంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, వారి సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లో 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. బుధవారం ఉదయం 6 గంటలకే రామానాయుడు స్టూడియోలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు మూడేళ్లుగా ఐటీ పన్ను బకాయిలు, బ్యాలెన్స్‌ షీట్ల రికార్డుల్లో అవకతవకలు దొర్లాయని.. సినిమా నిర్మాణ వ్యయాలు, వార్షిక ఆదాయాల లెక్కల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయన్న సమాచారంతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది.

రామానాయుడు స్టూడియోతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఏడు సంస్థలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రామానాయుడు స్టూడియోలోని ఆడిటింగ్‌ కార్యాలయం, జూబ్లీహిల్స్‌లోని సురేష్‌ ప్రొడక్షన్స్‌ కార్యాలయం, సురేష్‌ బాబు ఇల్లు, గెస్ట్‌ హౌస్‌లలోనూ సోదాలు జరిగాయి. దాదాపు 50 మందికి పైగా అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం. 

దాడులు జరిగిన అనుబంధ కంపెనీలివే.. 
సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దగ్గుపాటి ఫార్స్‌ అండ్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రాజేశ్వరి ఫార్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, స్పిరిట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ, సురేష్‌ ప్రొడక్షన్స్,  సురేష్‌ యాడ్స్‌ కంపెనీలపై దాడులు నిర్వహించారు. అన్ని కార్యాలయాల ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్‌ షీట్లను ఆయా సంస్థల ఆడిటర్ల సమక్షంలో తనిఖీలు చేశారు. ఐటీ రిటర్నులకు సంబంధించిన అనుమానాలతో సాధారణంగా చేసిన తనిఖీలేనని అధికారులు తెలిపారు. 

హీరోలు వెంకటేష్, నాని ఇళ్లపైనా..
రామానాయుడు స్టూడియోకు సంబంధించి ఏడు చోట్ల తనిఖీలు జరుగుతుండగానే.. నటుడు వెంకటేష్‌ నివాసం (పుప్పాలగూడలోని డాలర్‌హిల్స్‌), అన్నపూర్ణ స్టూడియో, నటుడు నాని ఇల్లు, కార్యాలయం, అక్కినేని నాగార్జున ఇల్లు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు జరిగాయి. 

కూకట్‌పల్లి ఎమ్మెల్యేపైనా..
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని వెంకట్రావునగర్‌ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచే అధికారులు సోదాలు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సందీప్‌రావు డైరెక్టర్‌గా కొనసాగుతున్న ప్రణీత్‌ హోమ్స్‌ కంపెనీ కార్యాలయాలతోపాటు, ఎండీ నరేందర్, మరో ఐదుగురు డైరెక్టర్ల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా