ఓ లుక్‌ వేయండి

16 Aug, 2018 02:29 IST|Sakshi
ఎన్టీఆర్‌

స్వాతంత్య్ర దినోత్సవం రోజున సినిమా ఫ్యాన్స్‌ అందరికీ ఫుల్‌ ట్రీట్‌. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’తో మాస్‌ టీజర్‌ అందిస్తే, వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ ఎలా ఉండబోతుందో అని చిన్న శాంపిల్‌ చూపించారు. ‘కేరాఫ్‌ కంచర పాలెం’లో ఉన్న మనుషులు ఎలా ఉంటారో, రాజుగాడికి 50 ఏళ్లు వచ్చినా పెళ్లి అవుతుందో లేదో అనే టెన్షన్‌ పెట్టారు. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ అంటూ బలమైన డైలాగ్‌ వినిపిస్తే, ‘మణికర్ణిక’గా కంగనా వీరనారి ప్రతాపం చూపించారు. తమిళంలో జ్యోతిక ‘మహిళలూ వినండి... మీకు కొన్ని సూచనలు ఉన్నాయి’ అన్నారు. ఏది ఏమైనా అన్ని ఇండస్ట్రీల మూవీ లవర్స్‌కు ఐ–ఫీస్ట్‌. ఓ లుక్‌ వేద్దాం.

ఎంటబడ్డానా నరికేస్తా...
‘ఆది, సాంబ’ వంటి ఫ్యాక్షన్‌ సినిమాలతో మాస్‌ హీరోగా పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్‌. మళ్లీ ఆ జానర్‌ని చాలా కాలంగా పూర్తి స్థాయిలో టచ్‌ చేయలేదు. కానీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో మళ్లీ ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ను టచ్‌ చేసినట్టు కనిపిస్తుంది. సీమలో వీర రాఘవ రెడ్డి వీర విహారం ఎలా ఉంటుందో టీజర్‌ ద్వారా చిన్న శాంపిల్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్‌. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?’ అంటూ మూడు వాక్యాల్లో హీరో పవర్‌ఫుల్‌ క్యారెక్టరైజేషన్‌ని జగపతిబాబు వాయిస్‌ ద్వారా మనకు పరిచయం చేశారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఎన్టీఆర్‌ పట్టుకున్న కత్తికి తన కలంతో పదును పెట్టారు త్రివిక్రమ్‌. ‘కంటబడ్డావా కనికరిస్తానేమో.. ఎంటబడ్డానా నరికేస్తా ఓబా..’ అంటూ సీమ యాసలో ఎన్టీఆర్‌ పలికిన సంభాషణలు టీజర్‌కి హైలైట్‌ అని చెప్పొచ్చు. జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి యస్‌.యస్‌. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్‌ 10న ఈ చిత్రం విడుదల కానుంది.

కంచరపాలెం ప్రేమ
ఫస్ట్‌ లుక్, ట్రైలర్స్‌ లాంటివి ఏమీ రిలీజ్‌ కాకముందే న్యూయార్క్‌ ఇండియన్‌æ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి అఫీషియల్‌ ఎంట్రీ అందుకొని అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఇండిపెండెంట్‌ సినిమా ‘కేరాఫ్‌ కంచరపాలెం’. మొత్తం నూతన నటీనటులతోనే దర్శకుడు వెంకటేశ్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కంచరపాలెం అనే ఊరిలోని ప్రజలనే పాత్రలుగా.. వాళ్లందరికీ నటనలో వర్క్‌షాప్‌ చేసి కంచరపాలెం ఊళ్లోనే మొత్తం చిత్రాన్ని షూటింగ్‌ చేశారు దర్శకుడు వెంకటేశ్‌. సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రిలీజ్‌ చేశారు. ఒక ఊరిలోనే నాలుగు భిన్న వయసుల వారి మధ్య ప్రేమకథగా తెరకెక్కిందీ చిత్రం.

మా సూచనలు వినండి
స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొన్ని సూచనలు ఇస్తున్నారు జ్యోతిక. ఇదంతా తన లేటెస్ట్‌ సినిమా ‘కాట్రిన్‌ మొళి’ ఫస్ట్‌ లుక్‌లో భాగమే. రాధామోహన్‌ దర్శకత్వంలో జ్యోతిక ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం ‘కాట్రిన్‌ మొళి’.  హిందీ హిట్‌ చిత్రం ‘తుమ్హారీ సులూ’కు రీమేక్‌ ఇది. ఇందులో జ్యోతిక రేడియో జాకీగా కనిపిస్తారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను బుధవారం హీరో సూర్య రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌ లుక్‌లో ‘‘మనసుకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఆకలేస్తే భర్త కంటే ముందే తినొచ్చు. భర్త ఒక చెంప మీద కొట్టాడని మరో చెంప చూపించాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినది మనం చేయొచ్చు.

కావాలనుకుంటే బొద్దుగా ఉండొచ్చు. ఇంట్లో రోజువారి పనులను షేర్‌ చేసుకొమ్మని భర్తను అడగొచ్చు. సంపాదించొచ్చు, ఇంట్లో కూడా ఇవ్వాలి, నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు, మనసులో కాదు.. అనుకున్నదాన్ని బయటకు అవును అని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. స్త్రీ, పురుషుడు ఒకటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అంటూ పది రూల్స్‌ ఉన్న బోర్డ్‌ని పట్టుకున్న జ్యోతిక ఫొటోను ఫస్ట్‌ లుక్‌గా రిలీజ్‌ చేశారు ‘కాట్రిన్‌ మొళి’ చిత్రబృందం. ఇందులో మంచు లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్‌ 18న రిలీజ్‌ కానున్న ఈ చిత్రాన్ని జి. ధనుంజయ్‌ నిర్మించారు.

నాకు రెండూ ఉన్నాయి
సుల్తాన్, టైగర్‌ జిందా హై తర్వాత సల్మాన్‌ ఖాన్‌ – అలీ అబ్బాస్‌ జాఫర్‌ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘భారత్‌’. దేశభక్తి చిత్రంగా వస్తున్న ఈ చిత్రం డైలాగ్‌ టీజర్‌ను బుధవారం రిలీజ్‌ చేశారు. ‘‘కొన్ని బంధాలు రక్తం వల్ల ఏర్పడతాయి.. మరికొన్ని మట్టి వల్ల ఏర్పడతాయి. నా దగ్గర అవి రెండూ ఉన్నాయి’’ అంటూ సల్మాన్‌ ఖాన్‌ డైలాగ్స్‌ పలికారు. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ సర్కస్‌ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. పర్సనల్‌ కారణాలతో ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో నుంచి హీరోయిన్‌గా తప్పుకున్న తర్వాత కత్రినా కైఫ్‌ ఆ స్థానంలోకి వచ్చారు. మరో బ్యూటీ దిశా పాట్నీ కూడా ఇందులో స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మాల్టాలో షూటింగ్‌ జరుగుతున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటమ్‌ సాంగ్‌ను షూట్‌ చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్‌ కానుంది.

వీరనారి ఝాన్సీ
రణభూమిలో మణికర్ణిక ఎంత రౌద్రంగా, ఆవేశంగా ఉంటారో చిన్నప్పుడు ఎన్నో కథలు విన్నాం, చదువుకున్నాం. వెండి తెరపై చూపించదలిచారు దర్శకుడు క్రిష్, కంగనా రనౌత్‌.  ఝాన్సీ పోరాట పటిమ ఏ విధంగా ఉంటుందో మనకు సరిగ్గా అంచనా లేదు. ఆ ఆవేశాన్ని ఫస్ట్‌ లుక్‌ ద్వారా కొంచెంగా చూపించారు ‘మణికర్ణిక’ చిత్రబృందం. కంగనా రనౌత్‌ ముఖ్య పాత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘మణికర్ణిక’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కమల్‌ జైన్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. భుజాన బిడ్డ, మొహంలో మొండి ధైర్యంతో యుద్ధ భూమిలో కత్తి పట్టుకున్న కంగనా రనౌత్‌ ఫొటోను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్‌ లుక్‌లా రిలీజ్‌ చేశారు. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాన్ని రచించిన విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ ప్లే అందించారు. వచ్చే ఏడాది జనవరి 25 ఈ చిత్రం విడుదల కానుంది.

అలాగే రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్, తమిళంలో ‘జయం’ రవి ‘అడంగమారు’ ట్రైలర్స్‌ కూడా రిలీజ్‌ చేశాయి.
 
మరో ప్రపంచంలోకి...
వరుణ్‌ తేజ్‌ ఆకాశానికి నిచ్చెన వేశారు. అంతరిక్ష వీధిలో తన విధి నిర్వహించడానికి ఎన్నో సాహసాలు చే శారట. మరి ఆ విశేషాలన్నీ చూడాలంటే డిసెంబర్‌ 21 వరకూ వేచి చూడాల్సిందే. వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్‌ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపిహెచ్‌’. ఫస్ట్‌ తెలుగు స్పేస్‌ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబు, జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.  ఇందులో అదితీ రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌గా ఏదో మిషన్‌లో నిమగ్నమై ఉన్న వరుణ్‌ తేజ్‌ లుక్‌ను ఫస్ట్‌ లుక్‌గా చిత్రబృందం రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కోసం జీరో గ్రావిటీ సెట్‌ని డిజైన్‌ చేశారు. హాలీవుడ్‌ స్టైల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. దాని కోసం యూనిట్‌ అంతా జీరో గ్రావిటీలో శిక్షణ కూడా తీసుకున్నారు.  ‘అంతరిక్షం 9000 కీమీ’ చిత్రాన్ని డిసెంబర్‌ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘మీ అందరి కోసం అవుట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాం’’ అని వరుణ్‌ తేజ్‌ అన్నారు.. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి. కెమెరా: జ్ఞానశేఖర్‌.

మరిన్ని వార్తలు