ప్చ్‌..  మళ్లీ నిరాశే

19 Dec, 2018 01:14 IST|Sakshi

భారతీయ చిత్ర పరిశ్రమకు మరోసారి  నిరాశ ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇండియా నుంచి  అస్సామీ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఆస్కార్‌ నామినేషన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేటగిరీకి ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’తో కలిపి మొత్తం 87 చిత్రాలు వెళ్లాయి. అయితే.. ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఆస్కార్స్‌ 2018 బరిలో నామినేషన్‌ దక్కించుకోలేకపోయింది. నిరుపేదలైన చిన్నారులు తమ కష్టాలు, బాధలను దిగమింగుకుంటూ జీవితాలను ఎలా సంతోషంగా మలుచుకున్నారు? అనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’. రీమాదాస్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా 2017 సెప్టెంబర్‌ 8న విడుదలై మంచి హిట్‌గా నిలిచింది.

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా జాతీయ అవార్డు కూడా పొందింది. ఈ చిత్రాన్ని రీమాదాస్‌ స్వస్థలమైన అస్సోంలోని చైగావ్‌ గ్రామంలోనే  తెరకెక్కించడం విశేషం. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఎంపికైన ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’కి తర్వాతి ఎంపిక ప్రక్రియలో మాత్రం చోటు దక్కలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఆస్కార్స్‌ వేడుక ఘనంగా జరగనుంది. కాగా ‘మదర్‌ ఇండియా, సలాం బొంబాయ్, ‘లగాన్‌’ వంటి చిత్రాలు కూడా గతంలో ఉత్తమ విదేశీ విభాగంలో నామినేషన్‌కి వెళ్లినా, దక్కించుకోలేకపోయాయి. 

మరిన్ని వార్తలు