నాప్కిన్స్‌కి నామినేషన్‌

24 Jan, 2019 00:41 IST|Sakshi

ఆస్కార్‌ బరి

కథిఖేరా... ఢిల్లీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. హాపూర్‌ జిల్లా. కొన్నాళ్ల కిందట అక్కడ మహిళల పరిస్థితి దారుణం. దేశంలోని చాలా ఊళ్లలాగే ఇక్కడ రుతుచక్రం గురించి చాలా అపోహలు, అంధ విశ్వాసాలూనూ. రుతు సమయం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లోని ఆడవాళ్లు ఎవరికంటా పడకుండా ఊరవతలకు వెళ్లి ఉండేవారు. ఇక అమ్మాయిలు పెద్దమనిషి అయ్యారు అంటే పెళ్లికి, సంసారానికి ఇంకా చెప్పాలంటే రేప్‌కి లైసెన్స్‌ వచ్చినట్టుగా భావించేవారట ఆ ఊళ్లో మగవాళ్లు. ఇలాంటి సామాజిక పరిస్థితులు, నెలసరి పట్ల అవగాహన లేమి ఉండేదక్కడ. సిగ్గుతో ఆడపిల్లలు చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యేవారు. అందుకే ఆ ఊళ్లో మొన్నమొన్నటి వరకు కూడా హైస్కూల్‌ పూర్తి చేసిన అమ్మాయి లేదు. రుతుసమయంలో శుభ్రత పాటించడం తెలియక ఎంతో మంది మహిళలు అనారోగ్యం పాలయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే రుతుచక్రం మొదలైన ఆడవాళ్లను అస్పృశ్యులుగా పరిగణించే సంప్రదాయం నెలకొందన్నమాట.  అక్కడే విప్లవమూ మొదలైంది. అదీ మహిళల నుంచి! శానిటరీ నాప్కిన్స్‌ తయారు చేసే మెషీన్‌ వచ్చింది. రుతుచక్రం, రుతు సమయం పట్ల ఉన్న అపోహలు పోయాయి. ఆడవాళ్లే నాప్కిన్స్‌ తయారు చేస్తూ మార్కెట్‌ కూడా వాళ్లే చేసుకుంటూ వాళ్ల ఆర్థిక పరిస్థితినీ మెరుగుపర్చుకున్నారు. ఆ నాప్కిన్స్‌కి ‘‘ఫ్లై’’ అనే పేరు పెట్టుకున్నారు. దాంతో ఆ ఊరి చిత్రమే మారిపోయింది.  ఓ షార్ట్‌ డాక్యు మెంటరీగానూ రూపుదిద్దుకుంది..  అదే... ‘‘పీరియడ్‌. ఎండ్‌ ఆఫ్‌ ది సెంటెన్స్‌’. ఆస్కార్‌ అవార్డ్స్‌ బరిలో డాక్యుమెంటరీ కేటగిరీలో షార్ట్‌లిస్ట్‌ అయింది. ఈ డాక్యుమెంటరీకి లాస్‌ఏంజెల్స్‌లోని ఓక్‌వుడ్‌ స్కూల్, ఫెమినిస్ట్‌ ఫౌండేషన్‌ రెండూ కలిసి ఫండింగ్‌ చేశాయి. దర్శకత్వం.. రేయ్‌కా జెహ్తాబ్చీ. 

రేయ్‌కా జెహ్తాబ్చీ.. అమెరికాలో పుట్టిన ఇరానీ వనిత. యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ డిగ్రీ చేశారు. మొదటి నుంచీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకింగ్‌ అంటే ఆసక్తి ఉన్న రేయ్‌కాకు ఫిల్మ్‌ మేకర్స్‌ అస్ఘర్‌ ఫర్హాది, పాల్‌ గ్రీన్‌గ్రాస్‌లే స్ఫూర్తి. ‘పీరియడ్‌. ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’.  డాక్యుమెంటరీ తీయడానికి నిర్మాతలు ఒక యంగ్‌ ఫిల్మ్‌మేకర్‌ గురించి వెదుకుతుంటే వాళ్లకు రేయ్‌కా గురించి తెలిసింది. అలా ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ‘‘ఓక్‌వుడ్‌ స్కూల్‌లోని పదిహేను నుంచి పదహారేళ్ల మధ్య వయసున్న అమ్మాయిలంతా ఇండియాలోని కథిఖేరా విలేజ్‌ మహిళల కోసం శానిటరీ నాప్కిన్‌ మెషీన్‌ కోసం ఆర్థిక సహాయం అందించడం, ఈ మెషీన్‌తో అక్కడి మహిళలు ఆరోగ్యంతోపాటు ఆర్థిక స్వావలంబననే సాధించడం నన్ను చాలా ఇన్‌స్పైర్‌  చేసింది. ఈ సినిమాకు అవార్డ్‌ వస్తుందా రాదా.. అన్నది సెకండ్‌ థింగ్‌. ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌.. ఇది ఆస్కార్‌ డాక్యుమెంటరీ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నందుకే చాలా గర్వంగా ఉంది’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు రేయ్‌కా జెహ్తాబ్చీ. ఈ సినిమా షూటింగ్‌ అంతా కథిఖేరాలోనే తీశారు. అందుకోసం రేయ్‌కా రెండుసార్లు ఇండియాను సందర్శించారు. శానిటరీ వెండింగ్‌ మెషీన్‌ రాకముందు ఊళ్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ ఊరివాళ్లను ఇంటర్వ్యూ చేయడానికి, తర్వాత షూటింగ్‌ కోసం. ఊళ్లోని  చాలా మంది దీనిమీద మాట్లాడ్డానికి ఇష్టపడలేదట. ప్యాడ్స్‌ తయారు చేసే మెషీన్‌ నెలకొల్పడానికి, దాన్ని ఆడవాళ్లే నడుపుకునేలా చేయడానికి స్నేహా అనే అమ్మాయి చేసిన ప్రయత్నాన్ని తెలుసుకుని చలించి పోయిందట రేయ్‌కా. ఆ సంఘటననూ ఉన్నదున్నట్లే ‘పీరియడ్‌. ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’లో పొందుపర్చారు రేయ్‌కా జెహ్తాబ్చీ.
– శరాది

మరిన్ని వార్తలు