మహిళల్లారా పదండి... దేశాన్ని వదిలేద్దాం!

6 May, 2016 00:41 IST|Sakshi
మహిళల్లారా పదండి... దేశాన్ని వదిలేద్దాం!

‘‘ఆడవాళ్లను లైంగిక వేధింపులకు గురి చేసేవాళ్లనూ, అత్యాచారం చేసేవాళ్లనూ వదలకూడదు. అరబ్ దేశాల్లో ఇలాంటివి చేస్తే కఠినంగా శిక్షిస్తారు. మన దేశంలో కూడా చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి’’ అని ప్రియమణి ఉద్వేగంగా అన్నారు. కేరళలో 30 ఏళ్ల  లా స్టూడెంట్ జిష అత్యాచారానికి బలై, అతి కిరాతకంగా హత్యకు గురైన సంఘటన పై ప్రియమణి ఈ విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ - ‘‘మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు. ఏ దేశంలో రక్షణగా ఉండగలుగుతామో అక్కడికి వెళ్లిపోవడం మంచిది. ఆడవాళ్లందరం దేశాన్ని వదిలేయడం మనకు శ్రేయస్కరం.

మన దేశంలో మనం సురక్షితంగా బతకలేమనిపిస్తోంది. భారతదేశంలో మహిళలను దేవతలా భావించి, పూజిస్తారని అంటారు. ఇలాంటి దేశంలో అత్యాచారం చేసి, ఎలా చంపేయగలుగుతున్నారు? కఠినమైన శిక్షలు విధిస్తే.. నేరాలు జరగవు’’ అని ఆవేశంగా అన్నారు. ప్రియమణి ఈ విధంగా స్పందించడం దుమారమే రేపింది. ‘ఇండియాలో నువ్విన్నాళ్లూ సేఫ్‌గానే ఉన్నావు కదా.. ఒక సెలబ్రిటీ అయ్యుండి దేశం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు’ అని కొంతమంది విమర్శించారు. ‘నీ మాటలు అక్షరాలా నిజం’ అని మరికొంతమంది అభినందించారు. నెగటివ్ కామెంట్స్‌కి ప్రియమణి స్పందిస్తూ- ‘‘దేశంలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పడం కూడా తప్పేనా? నా అభిప్రాయాలను నిర్భయంగా చెప్పినందుకు ‘నన్ను యాంటీ-ఇండియన్’ అంటున్నారు. చాలా బాధగా ఉంది’’ అన్నారు.