తెలిసిందే చెప్పా: కమల్‌ హాసన్‌

4 Mar, 2020 08:18 IST|Sakshi
క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసు కార్యాలయానికి వస్తున్న కమల్‌ హాసన్

ఖాకీల ముందుకు కమల్‌హాసన్‌

ఇండియన్‌–2 షూటింగ్‌ ప్రమాదంపై విచారణ

రాజకీయ వేధింపులని అభిమానుల ఆందోళన

ఇండియన్‌–2 షూటింగ్‌ సమయంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం నేపథ్యంలో ఆ చిత్ర హీరో కమల్‌హాసన్‌ మంగళవారం పోలీస్‌ ముందు హాజరయ్యారు. వాస్తవాలను పోలీసులకు చెప్ప డం నాధర్మం.. అదే చేశానని కమల్‌ మీడియాతో అన్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర షూటింగ్‌ గత నెల 19న రాత్రి చెన్నై పూందమల్లిలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతుండగా భారీ క్రేన్‌  కుప్పకూలి  అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ సహా ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నజరత్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇండియన్‌–2 చిత్రం కోసం ఈవీపీ స్టూడియోలో భారీసెట్‌ వేసే పనులు సాగుతుండగా ఇందుకు పోలీస్‌ నుంచి అనుమతి పొందలేదని విచారణలో బయటపడింది. చెన్నై నగర కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ ఆదేశాల మేరకు ఈ కేసు నజరత్‌పేట పోలీసుల నుంచి క్రైం బ్రాంచ్‌ పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. సెంట్రల్‌  క్రైం బ్రాంచ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ నాగజ్యోతి గత నెల 23వ తేదీన విచారణ ప్రారంభించారు. అనుమతి లేకుండా భారీ సెట్‌ నిర్మాణానికి సిద్ధమైన నిర్వాహకులను, క్రేన్‌ను బాడుగలకు ఇచ్చిన యాజమాన్యం, ఆపరేటర్‌ తదితర ఆరుగురిని విచారించారు. వారిచ్చిన వాంగ్మూలం ప్రకారం చిత్ర దర్శకుడు శంకర్‌కు సమన్లు పంపారు. ఈ సమన్లు అనుసరించి గత నెల 27వ తేదీన హాజరైన శంకర్‌ను సుమారు ఒకటిన్నర గంటకు పైగా విచారించారు.(కమల్, శంకర్, కాజల్‌ విచారణకు హాజరు కావాలంటూ..!)

ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత నిర్మాతలదేనని కమల్‌ చెబుతుండగా, శంకర్, కమల్‌లదే బాధ్యతని నిర్మాతలు వాదిస్తున్నారు. ఇలా ఇరువర్గాలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్న తరుణంలో విచారణకు హాజరుకావాల్సిందిగా గతనెల 29వ తేదీన క్రైంబ్రాంచ్‌ పోలీసులు కమల్‌హాసన్‌కు సమన్లు పంపారు. సమన్లు అందుకున్న కమల్‌ మంగళవారం ఉదయం 10 గంటలకు చెన్నై ఎగ్గూరులోని సెంట్రల్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసు కార్యాలయానికి వచ్చారు. విచారణాధికారైన అసిస్టెంట్‌ కమిషనర్‌ నాగజ్యోతి ముందు హాజరైనారు.

చిత్రం కోసం భారీసెట్‌ను వేయాలని ఆదేశించింది ఎవరు, ముందు జాగ్రత్తగా రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేదు, పరిశ్రమల్లో వినియోగించే భారీ క్రేన్‌ను అనుమతి లేకుండా ఎందుకు తెచ్చారు, ప్రమాదం జరిగినపుడు మీరు ఎక్కడున్నారు, ప్రమాదాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారా, ఆ సమయంలో తీసుకున్న చర్యలు ఏమిటి..? వంటి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు కమల్‌ ఇచ్చిన సమాధానాన్ని వీడియో ద్వారా వాంగ్మూలంగా నమోదు చేశారు. విచారణ సమయంలో కమల్‌తోపాటు అతడి న్యాయవాది కూడా రావచ్చని పోలీస్‌శాఖ అనుమతి ఇచ్చింది. అన్ని విషయాలూ తానే చెప్పగలనని న్యాయవాదిని కమల్‌ నిరాకరిస్తూ ఒంటరిగానే లోనికి వెళ్లారు. సుమారు 2.30 గంటలకు పైగా కమల్‌ను పోలీసులు విచారించారు. (రూ. కోటి ప్రకటించిన కమల్‌ హాసన్‌)

వాస్తవాలు చెప్పడం నా ధర్మం: కమల్‌హాసన్‌ 
విచారణ ముగించకుని బయటకు వచ్చిన కమల్‌హాసన్‌ మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు నన్ను పిలిపించారు. ప్రమాదం సమయంలో ఎలాంటి గాయాలకు గురికాకుండా బైటపడినవారిలో నేనూ ఒకడిని. అందుకే ప్రమాదం గురించి తెలిసిన విషయాలు చెప్పడం నా ధర్మం. అన్ని విషయాలు చెప్పాను. ఇకపై ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసు సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించాను.

ఇవి రాజకీయ వేధింపులే : కమల్‌ అభిమానులు 
రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకే అన్నాడీఎంకే ప్రభుత్వం కమల్‌ ను వేధింపులకు గురిచేస్తోందని కమల్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. కమల్‌ రాక ముందే పెద్ద సంఖ్యలో చెన్నై ఎగ్మూరులోని పోలీస్‌ స్టేషన్‌కు కమల్‌ అభిమానులు, మక్కల్‌ నీదిమయ్యం నేతలు చేరుకున్నారు. కమల్‌ రాగానే తోపులాట చోటుచేసుకుంది. ఇప్పటి వరకు అనేక తమిళ సినిమా షూటింగుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఆనాడు ఎవ్వరినీ ఇలా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించలేదని వారు విమర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన లైకా ప్రొడక్సన్స్‌ అధినేతలు, ఇతర నిర్మాతలను విచారణకు పిలవకుండా కమల్, శంకర్‌ను మాత్రమే పిలవడం వెనుక రాజకీయ కక్షసాధింపు ధోరణి ఉందని ఆరోపించారు

మరిన్ని వార్తలు