రంగుల ప్రపంచం వెనుక ఎన్నో విషాదాలు

15 Jun, 2020 12:31 IST|Sakshi

రంగుల ప్రపంచం వెనుక ఎన్నో విషాదాలు దాగిఉంటాయి. అవి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అందమైన సినీ ప్రపంచానికి చెందిన ఎంతో మంది నటీనటుల కెరీర్‌ కష్టాల్లో పడగానే దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. తాజాగా జరిగిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కూడా అలాంటిదే. రంగుల ప్రపంచంలో ఎన్నో కలలు కని చివరికి అర్ధాంతరంగా జీవితాలను ముగించిన కొందరి జీవితాలను పరిశీలిస్తే..  

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌
​​​​​​
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ధోనీ సినిమాతో దేశవ్యాప్తగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో సడన్‌గా చనిపోవడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆయన సూసైడ్‌కి కారణం తెలియలేదు. కొద్ది రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 'పవిత్ర రిస్తా' టీవీ సీరియల్‌తో పాపులర్ అయిన 34 ఏళ్ళ సుశాంత్.. 'కైపోచే' మూవీతో తన సినీ ఆరంగ్రేట్రం చేశాడు. చివరిసారిగా 'డ్రైవ్' చిత్రంలో నటించాడు. 

ప్రేక్ష మెహతా

యువ హిందీ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రేక్ష బలవన్మరణానికి పాల్పడ్డారు. క్రైం పెట్రోల్, లాల్ ఇష్క్, మేరి దుర్గ వంటి టీవీ షోలలో ప్రేక్ష నటించారు. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ప్యాడ్ మ్యాన్‌లోనూ ఒక పాత్ర పోషించారు. 25 సంవత్సరాల చిన్న వయసులో 2020 మే 25న తన జీవితాన్ని ముగించింది.

కుశల్‌ పంజాబీ

హిందీ నటుడు కుశల్‌ పంజాబీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ రియాలిటీ షో జోర్‌ కా జట్కాలో విజేతగా నిలిచిన కుశల్‌ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు.  ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

రంగనాథ్

ప్రముఖ సినీనటుడు, రచయిత రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌లోనూ నటించిన రంగనాథ్‌కి రచయితగా, సాహితీవేత్తగానూ మంచి పేరుంది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకి దాదాపు 15 ఏళ్లపాటు సపర్యలు చేసిన రంగనాథ్.. ఆమె మృతి తర్వాత ఒంటరితనానికి గురయ్యారు. ఆ డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.

విజయ్ సాయి

టాలీవూడ్‌ హాస్యనటుడు విజయ్ సాయి కూడా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. యూసఫ్ గూడ లో నివాసముంటున్న సాయి అతని అపార్ట్ మెంట్ లో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  అమ్మాయిలు-అబ్బాయిలు, బొమ్మరిల్లు, మంత్ర, అల్లరి, ధనలక్ష్మి తలుపు తడితే, ఒకరికి.. ఒకరు తదితర చిత్రాల్లో విజయ్ సాయి నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడమూ, మానసిక ఒత్తిడే ఆత్మహత్యకు కారణమని వార్తలు వచ్చాయి. 

ఉదయ్ కిరణ్

ఈ పేరు వినగానే మనకు చిన్న చిరునవ్వు మొహంపై ఉన్న ఓ రూపం కళ్లముందు కనిపిస్తుంది. ఈ హీరో తెలుగు ఇండస్ట్రీలో వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు. కారణాలు తెలియదు కానీ అప్పటి వరకు చేతినిండా సినిమాలతో ఉన్న ఆయన ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. గొప్ప నటుడు అవుతాడనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా వాలిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

మరిన్ని వార్తలు