వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు

25 Jan, 2018 00:30 IST|Sakshi
ఏయన్నార్‌, ఎన్టీఆర్‌లతో కృష్ణకుమారి

కృష్ణకుమారి హిట్స్

‘ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది’.... ‘అగ్గిపిడుగు’లో ఎన్టీఆర్‌ పక్కన కృష్ణకుమారి పాడుతూ ఉంటే ఆ జంట బాగుందనిపిస్తుంది. కురులు విరబోసుకుని, ముడి దగ్గర నక్షత్రం లాంటి ఆభరణం పెట్టుకుని ఆమె పాడుతుంటే ఏ మగాడికైనా ‘కురులలో– నీ కురులలో– నా కోరికలూగినవి’ అనే అనాలపిస్తుంది. ఈ పాట ఎంత హిట్టంటే చాలా ఆర్కెస్ట్రాలు నేటికీ ఆ పాట పాడుతూనే ఉంటాయి.
ఎన్టీఆర్‌కు కృష్ణకుమారి అంటే ఆకర్షణ. అందుకే గుర్రం ఎక్కి వెతుక్కుంటూ ‘వగలరాణివి నీవే అని ‘బందిపోటు’లో పాడుకున్నాడు. ఆమెకు దూరంగా ఉండటం వల్ల ‘ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే’ అని విరహం అనుభవించాడు. కృష్ణకుమారి మాత్రం తక్కువా? ఆమెకు  కూడా ఎన్టీఆర్‌ అంటే చాలా అభిమానం. అందుకే ‘కోవెల ఎరుగని దేవుడు కలడని’ అంటూ ‘తిక్క శంకరయ్య’లో అతడిని దేవుడిలా ఆరాధించింది. అతను పక్కన ఉన్నప్పుడు ‘మనసు పాడింది సన్నాయి పాట’ అంటూ ‘పుణ్యవతి’లో మురిసి పోయింది. ‘మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది’ తెలుసుకోమంటూ ‘లక్షాధికారి’లో తొందర పెట్టింది. ఎన్టీఆర్‌తో  ‘పల్లెటూరి పిల్ల’తో  మొదలైన కృష్ణకుమారి తెర అనుబంధం దాదాపు 25 సినిమాల వరకూ సాగింది.  

ఇక అక్కినేని, కృష్ణకుమారిది రొమాంటిక్‌ పెయిర్‌. ఆమెను చూసి అతడు ‘ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక’ అని ‘డాక్టర్‌ చక్రవర్తి’లో సాగుతున్న ట్రైన్‌లో కిటికీ పక్కన చేరి పాడుకోవడం మనమెలా మర్చిపోగలం?  ‘నువ్వంటే నాకెందుకో అంత ఇది’ అని ఏయన్నార్‌ ‘అంతస్తులు’ సినిమాలో ఆమె కోసం పడి చచ్చినట్టుగా మరెవరి కోసమూ పడి చావలేదు. ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా’ అని ‘కులగోత్రాలు’లో ప్రాధేయ పడినట్టుగా ఎవ్వరినీ ప్రాధేయపడలేదు. ఏయన్నార్‌ కోమల మనస్కుడు. సున్నిత హృదయడు. అతడిని నిరాకరించడం తగదు. అందుకే ఆమె కూడా అతడి ప్రేమను అర్థం చేసుకుంది. ‘నా కంటి పాపలో నిలిచిపోరా’ అని ‘వాగ్దానం’లో అతడిని కోరింది. ‘నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా’ అంటూ ‘జమిందార్‌’లో మాట ఇచ్చింది. ‘పులకించని మది పులకించెను’ అంటూ ‘పెళ్లికానుక’లో ఫైనల్‌గా అతడి ప్రేమను యాక్సెప్ట్‌ చేసింది.

తెలుగు సూపర్‌ స్టార్స్‌ ఎన్టీఆర్, ఏయన్నార్‌ ఇద్దరూ కృష్ణకుమారితో హిట్‌ సినిమాలు చేశారు. ఆమె ప్రమేయం పెర్ఫార్మెన్స్‌ కోసం కంటే గ్లామర్‌ కోసమే ఎక్కువ అవసరమని ఇండస్ట్రీ భావించింది. పాటలలో ఆ రోజులలో కృష్ణకుమారి చాలా హుషారుగా కనిపించేది. తెల్లచీర కట్టుకుని ఆమె చేసిన పాటలు జనాన్ని ఉడుకులాడించాయి. ‘తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము’ పాటలో ఏయన్నార్‌తో,  ‘దేవతయే దిగి వచ్చి మనషులలో కలిసిన కథ’ పాటలో ఎన్టీఆర్‌తో ఆమె తెల్ల చీరలో కనిపిస్తుంది. కృష్ణకుమారి డ్యాన్సింగ్‌ టాలెంట్‌ చూడాలంటే ‘పునర్జన్మ’లోని ‘దీపాలు వెలిగె పరదాలు తొలిగె’ పాటలో చూడాలి. అంత పొడగరి వెన్నును విల్లులా వంచి నర్తిస్తుంటే కళ్లార్పబుద్ధి కాదు. కృష్ణకుమారి పాటలలో కూడా కొన్ని తమాషాలు జరిగాయి. ఒకసారి ఒక పాట షూటింగ్‌ ఉందనగా కృష్ణకుమారి జ్ఞానదంతం వాచి దవడ పొంగిపోయింది. షూటింగ్‌ తప్పించుకోవడానికి వీల్లేదు. అవతల రిలీజ్‌ డేట్‌ పెట్టుకున్నారు. ఇక ఆమె ఆలోచన చేసి చెంపల మీదకు వచ్చేలా స్కార్ఫ్‌ కట్టుకుని పాట పాడింది. జనం అది కొత్త ఫ్యాషన్‌ అనుకున్నారు. మెచ్చుకున్నారు. ఆ పాట ‘చదువుకున్న ఆమ్మాయిలు’లోని– ‘కిలకిల నవ్వులు చిలికిన’... ఆ తర్వాత ఆమె కాంతారావుతో కూడా చాలా డ్యూయెట్స్‌ పాడింది.

‘ఇద్దరు మొనగాళ్లు’, ‘గురువును మించిన శిష్యుడు’, ‘పేదరాశి పెద్దమ్మ’ లాంటి చాలా సినిమాల్లో వాళ్లిద్దరి పాటలు ఉన్నాయి. అయితే కృష్ణకుమారి పొడగరి. ‘చిలకా గోరింక’తో కృష్ణంరాజు వచ్చేంతవరకూ ఆమెకు ఈడూ జోడూలాంటి హీరో దొరకలేదనే చెప్పాలి. తన కాలంలో సావిత్రి, జమున సూపర్‌ స్టార్స్‌గా చెలామణి అవుతున్నా తన మర్యాదకరమైన వాటా తాను తీసుకోగలిగింది కృష్ణకుమారి. అన్నట్టు సావిత్రిని టీజ్‌ చేస్తూ అక్కినేనితో కలిసి ‘అభిమానం’లో ఆమె పాడిన ‘ఓహో బస్తీ దొరసాని ఆహా ముస్తాబయ్యింది’... కూడా చాలా పెద్ద హిట్టే. సావిత్రితో కలిసి కృష్ణకుమారి ‘వరకట్నం’లోనూ నటించింది. ఈ సీజనల్‌ హిట్స్‌ మధ్యలోనే కృష్ణకుమారిని తలుచుకోవడానికి ఇంకో మంచి పాట కూడా ఉంది. చాలా ఆహ్లాదకరమైన పాట. ఏమిటో గుర్తుందా? ‘కానిస్టేబుల్‌ కూతురు’లోని ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’... పట్టీల పాదాలతో పరిగెడుతూ కృష్ణకుమారి ఆ అరటి పాదుల పెరడులో పాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది.  ఆ తోటలో పాదులు తీస్తూ అన్నగా నటిస్తున్న జగ్గయ్య íపీబీ శ్రీనివాస్‌ గొంతులో ‘మా చెల్లెలు బాల సుమా ఏమెరుగని బేల సుమా’ అనడం ఎంతో మురిపెంగా అనిపిస్తుంది. కాలానిది అనంతమైన పల్లవి. అంతులేని చరణం. నడుమ దొరికిన, ఇవ్వబడిన సమయంలో కృష్ణకుమారి తన పాట తాను అందంగా పాడి ముగించింది. ఆ తెర వెలుగుకు సెలవు.
– కె

మరిన్ని వార్తలు