సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం రాయల్టీ

9 Aug, 2018 00:45 IST|Sakshi
రాధాకృష్ణన్, సంజయ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆర్పీ పట్నాయక్, వేణు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

‘‘నేను ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడాను. రాయల్టీ రూపంలో ఏమీ సంపాదించలేదు. 2012లో రాయల్టీ గురించి పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ కావడానికి ముందు నాకు వచ్చిందేమీ లేదు. ఇప్పుడు రాయల్టీ అనేది సింగర్స్‌ హక్కు. దీని కోసమే ‘ఇస్రా’ కృషి చేస్తోంది. అర్హులందరూ ఇందులో సభ్యులుగా చేరాలి’’ అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌’ (ఇస్రా) ఆధ్వర్యంలో  ప్రస్తుతం సభ్యత్వ నమోదు జరుగుతోంది. ఈ సంస్థ బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.

ముఖ్య అతిథి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ –‘‘ఏదైనా ఒక పాట పాడిన వారు రూ.2 వేలు చెల్లించి ‘ఇస్రా’లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇప్పటికి 410 మంది సభ్యులున్నారు. గాయనీగాయకులకు భాషతో సంబంధం లేదు. నన్ను, ఏసుదాస్‌గారిని ఏ భాషవాళ్లంటే ఏమని చెబుతారు? రాయల్టీ గురించి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయేమోననే భయాలు వద్దు. రాయల్టీ వద్దని గతంలో ఎవరైనా సంతకాలు చేసినా అవి ఇప్పుడు చెల్లవు. సభ్యత్వం తీసుకుంటే  జీవితాంతం రాయల్టీ రూపంలో ఎంతో కొంత వస్తూనే ఉంటుంది.

సినిమా, జానపదాలు, గజల్, ఆధ్యాత్మిక, క్లాసికల్‌ పాటలు పాడిన వారందరూ రాయల్టీ పొందడానికి అర్హులే’’ అన్నారు. ‘ఇస్రా’ బోర్డ్‌ ఆఫ్‌ అడ్వైజర్స్‌లో ఒకరైన సంజయ్‌ టాండన్‌ మాట్లాడుతూ– ‘‘ఇంతకు మునుపు ఉన్న ఐపీఆర్‌యస్‌కు.. ఇప్పుడు మేం పెట్టుకున్న ఇస్రాకు సంబంధం లేదు. మా సంస్థ వల్ల వారి ఆదాయానికి నష్టం ఉండదు. ప్రస్తుతం స్టేడియమ్‌లలో సీటుకు రూ. 1.60  చొప్పున వసూలు చేస్తున్నాం. డిమాండ్‌ని బట్టి భవిష్యత్తులో పెరగొచ్చు, తగ్గొచ్చు.

రాయల్టీ విషయమై యు.యస్, యు.కె., బ్రెజిల్‌తో మాట్లాడాం. ఇటీవల బ్రెజిల్‌ నుంచే మాకు రూ.40 లక్షలు వచ్చాయంటే మన సంగీతానికి అక్కడున్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇప్పటిదాకా 2016లో రూ.51లక్షలు, 2017లో రూ. 1.2కోట్ల రాయల్టీ వసూలు చేసి అందజేశాం. సభ్యులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని అందిస్తున్నాం. మృతిచెందిన గాయనీగాయకుల రాయల్టీని వారసులకు అందిస్తాం’’ అన్నారు. ఆర్‌.పి.పట్నాయక్, శ్రీలేఖ, వేణు, కౌసల్య, కేఎం రాధాకృష్ణన్, సింహా తదితర సింగర్స్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు