విజయనిర్మల స్ఫూర్తితో...

21 Jul, 2014 23:12 IST|Sakshi
విజయనిర్మల స్ఫూర్తితో...

‘‘దర్శకురాలిగా నాకు విజయనిర్మల అంటే చాలా ఇష్టం. ఆమె స్ఫూర్తితోనే దర్శకత్వంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. గతంలో దాసరి నారాయణరావు దగ్గర ‘స్వప్న’ చిత్రానికి దర్శకత్వశాఖలో పనిచేశాను’’ అని శ్రీప్రియ చెప్పారు. ‘అంతులేని కథ’, వయసు పిలిచింది, పొట్టేలు పున్నమ్మ తదితర చిత్రాల్లో నటించిన శ్రీ ప్రియ ఇటీవలే వెంకటేశ్‌తో ‘దృశ్యం’ సినిమా డెరైక్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో శ్రీ ప్రియ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘సాధారణంగా లేడీ డెరైక్టర్స్ అంటే పరిశ్రమలో కొంత చిన్న చూపు ఉంది. కానీ వెంకటేశ్ అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోకుండా నటించారు. రీమేక్‌లు చేయడం ఓ రకంగా కష్టసాధ్యమైన వ్యవహారం. భవిష్యత్తులో సొంత సినిమాలే చేస్తాను తప్ప, రీమేక్‌లు చేయను’’ అని చెప్పారు.