ఆ అన్నదమ్ములిద్దరూ కలిస్తే తేజ్‌

6 Feb, 2018 01:11 IST|Sakshi
సాయిధరమ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి

‘‘తేజూతో ‘చమకు చమకు..’ సాంగ్‌ చేసేటప్పుడు చిరంజీవి గారే గుర్తుకొచ్చారు. రెండు మూడు సీన్స్‌లో పవన్‌కల్యాణ్‌లా తేజు కనపడేలా తీశాం. ఎందుకంటే చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారు కలిస్తే ఎలా ఉంటుందో తేజు స్టైల్‌ అలా ఉంటుంది’’ అన్నారు వీవీ వినాయక్‌. సాయిధరమ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వినాయక్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మించిన ‘ఇంటిలిజెంట్‌’ ఈ నెల 9న విడుదలవుతోంది. రాజమండ్రిలో జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘మెగా ఫ్యామిలీలోని కష్టపడే తత్వం తేజులోనూ ఉంది.

తేజు కూడా చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌ అంత పెద్ద స్టార్‌ కావాలి. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పట్నుంచి పెద్ద డైరెక్టర్‌ని అవుతానని నమ్మినవారిలో సి.కల్యాణ్‌ అన్నయ్య ఒకరు. ఆయన రామానాయుడిగారిలా వంద సినిమాలు తీస్తారు. ఆ జర్నీలో నేనూ  ఉంటాను. మాతోపాటు విడుదలవుతున్న ‘తొలి ప్రేమ’, ‘గాయత్రి’ సినిమాలు పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా వంద రోజుల ఫంక్షన్‌ తర్వాత ఆ రేంజ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న ఫంక్షన్‌ ‘ఇంటిలిజెంట్‌’. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్‌ వినాయక్‌గారు.

ఇంత మంచి సినిమా చేసే చాన్స్‌ ఇచ్చారు. ప్రేక్షకులకు, మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా గుర్తుండిపోయేలా ఉంటుంది. మెగాస్టార్, పవర్‌స్టార్, మెగాపవర్‌స్టార్, స్టైలిష్‌ స్టార్, వరుణ్‌.. నాకు పంచభూతాలు. చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారు, నాగబాబుగారు నాకు గురువులు. వారు లేకుండా ఈ స్టేజ్‌పై నేను లేను’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు తేజ్‌ చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. వినాయక్‌ సినిమాను ఇరగదీశారు. పాటలు చూస్తుంటే చిరంజీవిగారి సాంగ్స్‌ చూస్తున్నట్లుంటుంది. ఓ దర్శకుడు కారు దిగగానే సింహం, పులి, ఏనుగులా గంభీరంగా అనిపించేవారిలో దాసరిగారు ఒకరు. ఆయన తర్వాత అలా అనిపించే దర్శకుడు వినాయక్‌ మాత్రమే’’ అన్నారు సి.కల్యాణ్‌.

మరిన్ని వార్తలు