-

‘ఇంటిలిజెంట్‌’ మూవీ రివ్యూ

9 Feb, 2018 15:50 IST|Sakshi

తారాగణం : సాయిధరమ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి, రాహుల్‌ దేవ్‌, బ్రహ్మానందం తదితరులు
జానర్‌ : యాక్షన్‌, కామెడీ
నిర్మాత : సి. కళ్యాణ్‌
సంగీతం : ఎస్‌. తమన్‌
దర్శకుడు :  వి.వి. వినాయక్‌

మెగా అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే సుప్రీం హీరోగా ఎదిగాడు సాయి ధరమ్ తేజ్‌. గత కొంతకాలంగా సరైన హిట్‌లేక సతమతమవుతున్న తరుణంలో మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో చేసిన సినిమా ఇంటిలిజెంట్‌. మెగాస్టార్‌ కమ్‌బ్యాక్‌ మూవీతో హిట్‌ కొట్టిన వినాయక్‌, ఫుల్‌ ఎనర్జీ ఉన్న సాయిధరమ్‌ కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం...


కథ

నందకిషోర్‌ (నాజర్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు యజమాని. తనకు వచ్చిన లాభాలతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఎంతో మంది పేద పిల్లలను, అనాథలను చేర దీసి ఆదరిస్తూ ఉంటాడు. ప్రతిభ ఉన్న చిన్నారులను చదివిస్తుంటాడు. అలా తేజ (సాయిధరమ్‌ తేజ్‌)ను చదివిస్తాడు. ఆ కృతజ్ఞతతో నాజర్‌ వద్దే పనిచేస్తూ ఉంటాడు. తన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వల్ల మిగతా ఏ కంపెనీలు మనుగడను సాధించలేకపోతాయి. అలా ఓ కంపెనీ యజమానులు మాఫియా డాన్‌ విక్కీ‍భాయ్‌ (రాహుల్‌ దేవ్‌)ను ఆశ్రయిస్తారు. విక్కీభాయ్‌ తమ్ముడు దేవ్‌గిల్‌ రంగంలోకి దిగి నాజర్‌ను బెదిరిస్తాడు. కానీ నాజర్‌ వాటికి తలొంచడు. ఇదంతా తేజ రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాడు. ఆ మరునాడే నాజర్‌ ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ తేజ ఇదంతా నమ్మడు. దేవ్‌గిల్‌ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తేజ ఏం చేస్తాడు? అసలు నాజర్‌ది ఆత్మహత్యనా? హత్యనా? అసలు ఏం జరిగింది? తేజ ధర్మభాయ్‌గా ఎందుకు మారాడు? ధర్మభాయ్‌ ఏం చేశాడన్నదే మిగతా కథ.

నటీనటులు
సాయిధరమ్‌ తేజ్‌ డ్యాన్సులు, ఫైట్స్‌తో మెగా అభిమానులను అలరించాడు. లావణ్య త్రిపాఠి తన అందంతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసింది. బ్రహ్మానందం కనిపించే రెండు మూడు సీన్లలో నవ్వులు పండించాడు. నాజర్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆశిష్‌ విద్యార్థి, షియాజీ షిండే తమకు అలవాటైన పోలీస్‌ పాత్రలో మెప్పించారు. సప్తగిరి, పృథ్వీ, బ్రహ్మానందం, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ కామెడీని బాగానే పండించారు.

విశ్లేషణ
భారీ యాక్షన్‌ సీన్స్‌ , కామెడీతో తనదైన శైలిలోనే వినాయక్‌ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేదు. ఆకుల శివ అందించిన మాటలు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. సాంగ్స్‌ లొకేషన్స్‌ బాగున్నాయి. చమక్‌ చమక్‌.. సాంగ్‌ తీసిన విధానం ఆకట్టుకుంది. వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంది. తమన్‌ సంగీతానికి మార్కులు పడ్డాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ప్లస్ పాయింట్. ఎస్వీ విశ్వేశ్వర్‌ ఛాయాగ్రహణంతో మెప్పించాడు. ఆయన కెమెరా పనితనం స్క్రీన్‌ను అందంగా కనపడేలా చేసింది. ఎడిటింగ్‌ కూడా బాగానే ఉంది. కొరియోగ్రఫీలో కొత్తదనం కనిపించింది.

ప్లస్‌ పాయింట్స్‌
పాటలు, ఫైట్స్‌
కామెడీ
చమక్‌ చమక్‌ సాంగ్‌

మైనస్‌ పాయింట్స్‌
కథలో కొత్తదనం లోపించడం

ముగింపు: ‘ఇంటిలిజెంట్‌’ అభిమానులు ఆశించినంత ఇంటిలిజెంట్‌గా లేదు.

- బండ కళ్యాణ్‌, ఇంటర్నెట్‌ డెస్క్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు