సామాన్యుడిగా సూపర్ స్టార్..!

21 Jul, 2016 09:28 IST|Sakshi
సామాన్యుడిగా సూపర్ స్టార్..!

ఒక సినిమాకు ఇంత స్థాయిలో హైప్ వస్తుందా..? ఓ హీరో బొమ్మతో బంగారు నాణేలు విడుదలవుతాయా..? సినిమా పోస్టర్లను విమానాల మీద ముద్రిస్తారా..? ఒక  సినిమా ఒకేసారి వేల థియేటర్లలో రిలీజ్ అవుతుందా..? నమ్మలేని నిజాలనిపించే ఈ విశేషాలను కబాలి సినిమాతో నిజం చేసి చూపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. నిన్నటి వరకు సౌత్ సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీ.. ఈసినిమాలో ఇంటర్ నేషనల్ సూపర్ స్టార్ గా అవతరించాడు. బస్ కండక్టర్ నుంచి భారతీయులు గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చిన రజనీ తెర వెనక ఎలా ఉంటాడు..? ఆయన అలవాట్లేంటి..? బస్ కండక్టర్ శివాజీరావ్ గైక్వాడ్ నుంచి.. సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు..?

రజనీ కాంత్ ప్రతి హోలీ పండుగకు త న గురువు బాలచందర్‌కు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకుంటారు. కానీ ఆ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం  బాలచందర్‌కూ తెలియదు. కొ న్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'శివాజీ రావ్ గైక్వాడ్ గా ఉన్న నా పేరును రజనీకాంత్ గా మార్చింది హోలీ రోజునే సార్‌!'అన్నారట. రజనీకాంత్‌ ఇంట్లో ఉన్నప్పుడు నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు. ఆయన  ఇష్ట దైవం వినాయకుడు. రజనీకాంత్ వివాహం తిరుపతిలో జరిగింది.

రోడ్డుపక్కనున్న కాకా హోటళ్లలో భోజనం చేయటం రజనీకి చాలా ఇష్టం. పోరూర్‌ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట. ఏవీఎం స్టూడియోలో షూటింగ్ జరిగితే.. రజనీకాంత్‌ నెంబర్ 10 మేకప్ రూమ్ లో బస చేస్తారు. అది ఆయనకు సెంటిమెంట్. చెన్నైలో షూటింగ్‌ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఆయన ఇంటి నుంచే వెళ్తుంది. తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా చేశారు. మెరీనా బీచ్లో అమ్మే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం.

'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్‌ గుమ్మంపై ఉంటుంది. రజనీకాంత్‌ మాట్లాడిన తొలి పంచ్‌ డైలాగ్‌ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?). రజనీకాంత్‌ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్‌, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు. తన ఏ సినిమా షూటింగ్ పూర్తి చేసినా, ఆ చిత్రానికి పనిచేసి సహాయకులకు కొంత మొత్తాన్ని కానుకగా ఇస్తుంటాడు రజనీ.

తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన కెరీర్ లో అత్యధికంగా ఎస్‌.పి.ముత్తురామన్‌ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించారు. హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో  కుప్పలతెప్పలుగా ఉంటాయి.  తనకు నచ్చిన పాటకు సంగీత దర్శకుడెవరో తెలుసుకుని ఫోన్‌ చేసి వారిని అభినందించటం రజనీకి అలవాటు.

ఇప్పటికీ తన ఇంటిలోని పెద్ద అద్దం ముందు నిలబడి రిహార్సల్స్‌ చేస్తుంటారట. తనకు ఎంత ఆప్తులైనా వారికోసం ఎలాంటి సిఫారసు మాత్రం చేయరు.  సిగరెట్‌ తాగటం చాలా ఇష్టం. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడా అలవాటు మానుకున్నారు. టూవీలర్ నడుపుతూ చెన్నై వీదుల్లో తిరగటం అంటే సరదా.. అప్పుడప్పుడు మారువేశాల్లో అలా బయటికి వస్తుంటారు.  

రజనీకాంత్‌కు ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాదే. ఆయనతో ఎంతో చనువుగా ఉంటే రజనీ స్వామి అని పిలుస్తారు. రజనీకి ఇప్పటికీ పర్సు, క్రెడిట్‌ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్‌ మనీగా రూ.500 మాత్రమే తీసుకెళ్తారు. అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారితో ఆనందంగా సమయం గడుపుతుంటారు.

తనతో ఫొటో దిగేందుకు వచ్చే వారిలో చిన్నారులుంటే వారిని ఎత్తుకుని ఫోజివ్వటం రజనీకాంత్‌ అలవాటు. పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటి పేరు 'బృందావన్‌'. ఇది ఆయనే పెట్టుకున్నారు. ఆ ఇంటిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో రాయించారు.  విమాన ప్రయాణాలకన్నా రైలు ప్రయాణాలకే రజనీకాంత్‌ మొగ్గుచూపుతారు.

తలైవా.. మీ పుట్టినరోజునాడు మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నామ'ని అభిమానులు అడిగితే.. 'అసలు నేనెందుకు పుట్టాననే విషయాన్ని  తెలుసుకునేందుకు ఆ రోజంతా ఏకాంతంగా గడుపుతాను. ప్లీజ్‌ ఆరోజున నన్ను వదిలేయండి'అని అభిమానులకు దూరంగా ఉంటారు. కె.బాలచందర్‌ గారంటే రజనీకి ఎంతో గౌరవం. ఆయన ఎప్పుడు ఫోన్‌ చేసినా లేచి నిలబడే మాట్లాడతారు. అదీ ఆయన గురుభక్తి.

ఫిలిం ఛాంబర్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో చాలా సందర్భాల్లో ఫీజు కూడా కట్టలేకపోయేవారట. ప్రిన్సినల్‌ రాజారామ్‌దాస్‌సహాయం చేశారట. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటుంటారు. తనను కలిసేందుకు ఎవరు వచ్చినా, వయస్సులో చిన్నవారైనా లేచి నిలబడి వారిని ఆహ్వానిస్తారు. వారు కూర్చున్నాకే తాను కూర్చుంటారు.. రజనీకాంత్‌ ఏ కారులో వస్తారనే విషయాన్ని ఎవరూ ముందే ఊహించలేరు. ఖరీదైన కార్లకు దూరంగా ఉండే సూపర్‌స్టార్‌ అంబాసిడర్‌, క్వాలీస్‌లో మాత్రమే  ప్రయాణిస్తుంటారు.

రజనీకి రోజూ రెండు మూడు సినిమాలు చూడటం అలవాటు.. అందులోనూ తప్పనిసరిగా రోజు ఓ ఇంగ్లీష్ సినిమాను చూస్తారు.  ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం పంపిస్తారు. తొలినాళ్లలో నల్ల దుస్తులను ఇష్టపడే రజనీకాంత్‌ ప్రస్తుతం ఎక్కువగా తెల్ల రంగు బట్టలను వాడుతున్నారు. రజనీకాంత్‌ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లాడ్‌ స్టోన్‌' 1988 అక్టోబరు 7న విడుదలైంది. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు రజనీ.

తన దగ్గర పాతికేళ్ల పాటు పనిచేసి తరువాత మానేసిన ఉద్యోగికి ఇప్పటికీ జీతం ఇస్తూనే ఉన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా అక్కడి బస్సుల్లో నిల్చొనే ప్రయాణిస్తారు. కారణం అడిగితే కండక్టర్‌ కాలం నాటి అలవాటు అని చెబుతుంటారు. అల్లుడు ధనుష్‌ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి ప్లేటు, గ్లాస్‌ కానుకగా ఇస్తారు.  'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు.

ఆభరణాలను రజనీ ఇష్టపడరు. గతంలో రజనీ తన కుడిచేతికి కడియం ధరించేవారు. ఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్‌ కు బహుమతిగా  వెళ్లింది. ఆధ్యాత్మికం కాకుండా ప్రపంచ రాజకీయ నేతల జీవిత చరిత్రల పుస్తకాలను చదవటం రజనీకి చాలా ఇష్టం. రూ.50 కోట్లతో రజనీకాంత్‌ తిరువళ్లువర్‌గా నటించే చిత్రాన్ని నిర్మించేందుకు ఓ సంస్థ పనులు కూడా ప్రారంభించింది. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఎంజీఆర్‌, శివాజీలంటే మహా ఇష్టం. ఎంజీఆర్‌ తమిళ సినిమా మార్గదర్శి, శివాజీ గణేశన్‌ ఓ నిఘంటువు.. అని అభివర్ణిస్తుంటారు రజనీ.