సెన్సార్‌లో సినిమా కష్టాలు..

25 Feb, 2018 09:28 IST|Sakshi
స్మారక సంచికను ఆవిష్కరిస్తున్న ప్రముఖ నటీమణి సుమలత(ఇన్‌సెట్‌లో డైరెక్టర్‌ మణిరత్నం)

చిత్రోత్సవంలో దర్శకుల ఆవేదన

జీవన సాఫల్య ప్రశస్తికి మణిరత్నం ఎంపిక 

సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు బెంగళూరులో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు గురువారం రాత్రి నుంచి ఆరంభమయ్యాయి. నగరంలో వివిధ థియేటర్లలో జరుగుతున్న అపురూప సినిమాలను వీక్షించడానికి పెద్దసంఖ్యలో సినీ ప్రముఖులు, చిత్రప్రియులు తరలివస్తున్నారు.  ఈ ఏడాది ప్రముఖ దర్శక దిగ్గజం మణిరత్నంను జీవన సాఫల్య పురస్కారంతో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సత్కరించనుంది. 

కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్‌ ఎస్‌వీ రాజేంద్ర సింగ్‌ బాబు నేతృత్వంలోని 13 సభ్యుల ఎంపిక కమిటీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు మణిరత్నంను ఎంపిక చేసింది. మార్చి 1న ముగింపు వేడుకల్లో ఆయనను సన్మానిస్తారు. మరోవైపు ఉత్సవాల రెండోరోజు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై నిపుణులు చర్చించారు. అంతేకాకుండా భారత్‌లో సెన్సార్‌ అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.

సినిమాను బతికించుకోవాలి: రాజేంద్రసింగ్‌
రాజేంద్రసింగ్‌ బాబు సెన్సార్‌షిప్‌లో ఎదురయ్యే ఇబ్బందులను చర్చించారు. సెన్సార్‌ బోర్డు రాజకీయ ప్రేరేపణలో పనిచేస్తోందని చెప్పారు. సినిమాను బతికించుకోవాలంటే ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలసి ఒక క్రమమైన విధివిధానాలను రూపొందించుకోవాలని సూచించారు. సినిమా చిత్రీకరించడం ఒక ఎత్తయితే, దానికి సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ సాధించడం మరో ఎత్తని ఆయన తెలిపారు. 

సీబీఎఫ్‌సీ ప్రాంతీయ అధికారి శ్రీనివాసప్ప మాట్లాడుతూ.. నియమావళి ప్రకారమే సెన్సార్‌షిప్‌ చేస్తున్నాం. అయినా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని ఎలాగైనా పరిష్కరించుకుంటామని తెలిపారు. దిమిత్రివ్‌ దే క్లెర్క్, మహేష్‌ నారాయణన్, రత్నా సేన్‌గుప్తా అనే ముగ్గురు దర్శకులు ముచ్చటిస్తూ సినిమాలపై ఆసక్తితో తాము ఈ రంగానికి ఎంచుకున్నట్లు తెలిపారు. సినిమా ద్వారా ఎంతోమందిలో స్ఫూర్తినింపొచ్చని తెలిపారు. 

సూపర్‌ సెన్సారింగ్‌ ఇబ్బందికరం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్‌ శత్యూ మాట్లాడుతూ.. తనకు సెన్సార్‌ బోర్డు వ్యవహార శైలీతో ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ సినిమా విడుదలయ్యాక అందులో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని, కొన్ని సీన్లు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ చాలామంది సూపర్‌ సెన్సార్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పద్మావత్‌ మణికర్ణిక తదితర సినిమాలపై కొంతమంది వ్యక్తులకు వచ్చే ఇబ్బందులేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పారు. సినిమా వ్యక్తులు ఇలాంటి ఎన్నో కష్టాలను అధిగమించి విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం చాలా దారుణమని తెలిపారు. దేశంలో సెన్సార్‌ వ్యవస్థను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. 


 

మరిన్ని వార్తలు