రాముడు... రావణుడు...మన ఊరి రామాయణం

4 Oct, 2016 23:24 IST|Sakshi
రాముడు... రావణుడు...మన ఊరి రామాయణం

వెండితెరపై విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్. ఆయనలో నటుడు మాత్రమే కాదు.. రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా ఉన్నారు. ‘ధోని’, ‘ఉలవచారు బిర్యాని’ చిత్రాలు దర్శక-నిర్మాతగా ప్రకాశ్‌రాజ్ అభిరుచి ఏంటో ప్రేక్షకులకు తెలియజేశాయి. తాజాగా ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మన ఊరి రామాయణం’. ఒకరిద్దరు కాదు.. ఐదుగురు జాతీయ ఉత్తమ పురస్కార గ్రహీతలు ఇళయరాజా, ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, శ్రీకర ప్రసాద్, శశిధర్ అడపా పని చేసిన చిత్రం ఇది.  ఈ నెల 7న ‘మన ఊరి రామాయణం’  విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ చెప్పిన విశేషాలు.

 ♦ ప్రతి మనిషిలోనూ రాముడు, రావణుడు.. ఇద్దరూ ఉంటారు. సందర్భాన్ని బట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వస్తారు. అటు వంటి కథను ఈ చిత్రంలో చెప్పబోతున్నా. దుబాయ్ నుంచి సొంతూరికి వచ్చిన పెద్ద మనిషి భుజంగయ్య పాత్రలో నేను నటించా. సత్యదేవ్, రఘుబాబు, పృథ్వీలు ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.

 ♦ ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియమణి పాత్ర ప్రవహించే నదిలా ఉంటుంది. ఆ ప్రవాహంలో ఎప్పుడు ఏది ఎదురవుతుందో చెప్పడం కష్టమే. ఆ ప్రవాహం ఎన్ని మలుపులు తిరిగింది? దారిలో ఏం దాగుంది? ఎక్కడ ఆగుతుంది? అనేది ఎవరికీ తెలీదు. ఆ భావోద్వేగాలను ప్రియమణి పలికించిన తీరు అద్భుతం. పాత్రలో జీవించింది.

 ♦దర్శకుడిగా నేను కథను మాత్రమే చెప్పగలను. కానీ, ఆ కథలో భావోద్వేగాలను, ఆత్మను తెరపై ఆవిష్కరించేది స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతమే. నా దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలకు ఆయనే సంగీతం అందించారు. మరోసారి ఈ చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు.

మంచి కథను ప్రేక్షకులు బోర్ ఫీలవ్వకుండా చెప్పడం చాలా ముఖ్యం. శ్రీకర్ ప్రసాద్ క్రిస్పీ ఎడిటింగ్ కథను వేగవంతం చేసింది. గ్రామీణ నేపథ్యంలోనే కథంతా జరుగుతుంది. ఆ ఫీల్ తీసుకురావడానికి జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిత్రీకరించాం. ఆ పల్లెటూరి వాతావరణం తెరపైకి తీసుకొచ్చిన ఘనత ప్రొడక్షన్ డిజైనర్ శశిధర్ అడపాదే. ఈ చిత్రకథను ప్రేక్షకులందరికీ చేరువయ్యేలా చెప్పడంలో వీళ్లందరి కృషి ఉంది.

 ♦ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా ‘మన ఊరి రామాయణం’ రషెస్ చూసిన తర్వాత తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకొచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై చిత్రం విడుదలవుతుంది.