నాన్న కోరిక నెరవేరుస్తా!

30 Jun, 2013 06:45 IST|Sakshi
నాన్న కోరిక నెరవేరుస్తా!
ఇంటర్వ్యూ   సుమంత్ అశ్విన్
అంతకు ముందు అతను అసిస్టెంట్ డెరైక్టర్. ఆ తర్వాత హీరో. 
మరి.. ఆ తర్వాత? ఏమో.. భవిష్యత్తు గురించి చెప్పలేనంటున్నారు
సుమంత్ అశ్విన్... సన్నాఫ్ యమ్మెస్ రాజు. ‘తూనీగ తూనీగ’
చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన సుమంత్ ప్రస్తుతం 
‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలో నటిస్తున్నారు. 
ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మంచి పాత్ర 
చేశానంటున్నారు సుమంత్. ఈ హ్యాండ్‌సమ్ హీరో పుట్టినరోజు
నేడు. ఈ సందర్భంగా  సుమంత్‌తో జరిపిన ఇంటర్వ్యూ...
 
ఇప్పటివరకు మీరు జరుపుకున్న పుట్టిన రోజుల్లో మర్చిపోలేనిది?
నా టీనేజ్‌లో అంటే... పదహారు నుంచి పద్ధెనిమిదేళ్ల వయసులో జరుపుకున్న పుట్టినరోజులను ఎప్పటికీ మర్చిపోలేను. వర్షం, నువ్వొస్తానంటే షూటింగ్ లొకేషన్స్‌లో ఆ బర్త్‌డేలు జరిగాయి. ఆ చిత్రాలకు నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. ఆ యూనిట్ సభ్యులు సమక్షంలో.. అది కూడా అరకులో షూటింగ్ జరిగినప్పుడు అందమైన వాతావరణంలో పుట్టినరోజు వేడుక జరిగింది.
 
జనరల్‌గా బర్త్‌డే ఎలా జరుపుకుంటారు?
పెద్ద హంగామా ఏమీ ఉండదు. నా చిన్నప్పుడు అమ్మానాన్న గ్రాండ్‌గా జరిపేవాళ్లు. ఇప్పుడు సింపుల్‌గా జరుపుకుంటున్నాను. ఇంట్లో పూజ చేయడం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం... అంతే.
 
ఈ సందర్భంగా కొత్త నిర్ణయాలేమైనా తీసుకున్నారా?
లేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాల పైన ఉంది. హార్డ్‌వర్క్ చేసి, మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. 
 
సినిమాల మీద ఎప్పుడు ఇంట్రస్ట్ ఏర్పడింది?
స్కూల్లో చదివేటప్పుడు యూఎస్ వెళ్లి పై చదువులు చదువుకుంటావా లేక సినిమాల్లోకి రావాలనుకుంటున్నావా? అని నాన్నగారు అడిగేవారు. అప్పుడు సినిమాలంటే ఇష్టం ఉండేది. తను నిర్మించే సినిమాల గురించి నాన్నగారు ఇంట్లో చెబుతుండేవారు. సాయంత్రం షూటింగ్‌కి పేకప్ చెప్పి, ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిది వరకు సినిమాల గురించి ఏదో ఒకటి చెబుతుండేవారు. దాంతో నాకు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రస్ట్ ఏర్పడసాగింది. అందుకే ‘వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను.
 
మరి... హీరో అయ్యారు?
నన్ను చూసినవాళ్లు ‘మీ అబ్బాయి మంచి హీరో అవుతాడు’ అని నాన్నతో అనేవాళ్లు. నాకెలాగూ సినిమాలంటే ఇంట్రస్ట్ కాబట్టి హీరో చేయాలని నాన్నగారు అనుకున్నారు. నాక్కూడా ఆ ఆలోచన ఉండటంతో ‘తూనీగ తూనీగ’తో హీరో అయిపోయాను.
 
సినిమాల్లోకి ప్రవేశించేటప్పుడు మీ నాన్నగారు ఏమన్నారు?
నా చిన్నప్పట్నుంచీ నాన్నగారు నాతో అనే మాట ఒకటే. ‘ఎమ్మెస్ రాజుగారబ్బాయి సుమంత్ అశ్విన్’ అని కాకుండా ‘సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్మెస్ రాజు’ అనిపించుకోవాలి అని. ఆయన కోరికను నెరవేర్చడానికి ఎంత హార్డ్‌వర్క్ చేయాలో అంతా చేస్తా.
 
ప్రస్తుతం చేస్తున్న ‘అంతకు ముందు ఆ తర్వాత’ గురించి?
నా కెరీర్‌కే కాదు వ్యక్తిగతంగా కూడా ఉపయోగపడిన సినిమా ఇది. బలమైన కథాంశంతో రూపొందించిన చిత్రం కావడంవల్ల నాలో మెచ్యూరిటీ వచ్చింది. ఒకవేళ నా లైఫ్‌లో రిలేషన్‌షిప్స్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సునాయాసంగా టాకిల్ చేయగలననే ఆత్మవిశ్వాసం కలిగించిన చిత్రం ఇది. అంత స్పాన్ ఉన్న కథ. ఈ చిత్రంతో నాకు మంచి బ్రేక్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ‘అంతకు ముందు ఆ తర్వాత’ రూపంలో దామోదర్‌ప్రసాద్, ఇంద్రగంటి మోహనకృష్ణగార్లు నాకు మంచి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల ఈ చిత్రం రషెస్ చూసి, ‘చాలా బాగుందిరా’ అని నాన్నగారు అన్నారు. అదో బహుమతిలా భావిస్తున్నా.
 
తదుపరి చిత్రాలు?
మంచి కథలు ఎంపిక చేసుకున్నాను. ‘అంతకు ముందు ఆ తర్వాత’ విడుదల రోజున వాటిని ప్రకటిస్తాను.