శ్రమిస్తే విజయం తథ్యం

23 Sep, 2017 03:12 IST|Sakshi

తమిళసినిమా: కష్టపడి శ్రమిస్తే విజయం తథ్యమని ఒలింపిక్‌ క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మారియప్పన్‌ పేర్కొన్నారు. తిరు వీ కా పూంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయనపై విధంగా వ్యాఖ్యానించారు. సెంథిల్‌.సెల్‌ అమ్‌ కథానాయకుడిగా నటించి ద బడ్జెట్‌ ఫిలిం కంపెనీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం తిరు వీ కా పూంగా. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది.

అతిథిగా పాల్గొన్న మారియప్పన్‌ మాట్లాడుతూ చిత్ర దర్శక నిర్మాత, కథానాయకుడు సెంథిల్‌ తనను బెంగళూర్‌లో కలిసి తిరు వీ కా పూంగా చిత్రం గురించి చెప్పి, ఇది ప్రేమలో విఫలమైన వారు ఆత్మహత్యలకు పాల్గొంటున్నారని, అలాంటి వాటిని అడ్డుకునే చిత్రంగా ఉంటుందని అన్నారన్నారు. చిత్రాన్ని ప్రదర్శించి చూపించారని తెలిపారు. చిత్రం తనకు చాలా నచ్చిందన్నారు. ఎందుకంటే మా కుటంబంలో తనతో పాటు అక్క, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని, నాన్న లేరని చెప్పారు. అమ్మే కష్టపడి మమ్మల్ని పెంచి పోషించారని తెలి పారు. అమ్మ లేకపోతే తానీ స్థానంలో నిలబడే వాడిని కాదని అన్నా రు.

ప్రేమలో విఫలం అయితే ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. అలా అయితే తానూ క్రీడను ప్రేమించానని,  ఆర్థిక సమస్యల కారణంగా క్రీడాకారునిగా కొనసాగడానికి చాలా కష్టపడ్డానని అన్నారు. 2012లో పాస్‌పోర్టు లేక ఒలింపిక్‌ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయానని చెప్పారు. ఆ తరుణంలో కలత చెంది ఏదైనా తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటే ఇప్పుడీ స్థాయిలో ఉండేవాడిని కాదన్నారు. మంచి సందేశంతో చిత్రం చేసిన తిరు వీ కా పూంగా చిత్ర దర్శక నిర్మాత, కథానాయకుడు సెంథిల్‌కు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని మారియప్పన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు