నా వ్యాధి గురించి నేనే చెప్తా : బాలీవుడ్‌ నటుడు

6 Mar, 2018 12:39 IST|Sakshi
బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌

నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఆరోగ్య సమస్యల కారణంగా విశాల్‌ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదా పడిన వార్త వచ్చిన దగ్గర నుంచి ఇర్ఫాన్‌ ఆరోగ్య సమస్యలపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై స్పందించిన ఇర్ఫాన్‌ తన ఆరోగ్య పరిస్థితి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు.

‘గత పదిహేను రోజులుగా నా జీవితం సస్పెన్స్‌ స్టోరిని తలపిస్తోంది. ఎప్పుడూ అరుదైన కథల కోసం అన్వేషించే నాకు ఓ అరుదైన వ్యాధి ఉన్నట్టుగా తెలిసింది. నేను ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. నా ఇష్టాల కోసం పోరాడుతూనే ఉన్నాను. అలాగే ఉంటాను. నా కుటుంబ సభ్యులు, మిత్రలు నాతో ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఈ సమయంలో మీరు వదంతులు సృష్టించకండి. నా కథను నేను మరో వారం పది రోజుల్లో వెల్లడిస్తాను’ అంటూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు ఇర్ఫాన్‌ ఖాన్‌.

జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు అందుకున్న ఇర్ఫాన్‌ ఖాన్, సినీ రంగానికి చేసిన సేవలకు గానే పద్మశ్రీ అవార్డను సైతం అందుకున్నారు. పలు భారతీయ భాషలతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ఇర్ఫాన్‌ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న బ‍్లాక్‌మెయిల్‌, పజిల్‌, కర్వాన్‌, రైతా చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇర్ఫాన్ ట్వీటర్‌ పోస్ట్‌పై బ్లాక్‌మెయిల్‌ చిత్ర దర్శకుడు అభినయ్‌ డియో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘తనతో నేను చాలా సమయం గడిపాను. ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేద’న్నారు.

మరిన్ని వార్తలు