క్యాన్సర్‌ కదా... అందుకే: నటుడి భావోద్వేగం!

12 Feb, 2020 19:57 IST|Sakshi

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘‘ఆంగ్రేజీ మీడియం’’.. హోమీ అదజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దినేశ్‌ విజాన్తో కలిసి జియో స్టూడియోస్‌ నిర్మిస్తోంది.  2017లో విడుదలైన కామెడీ డ్రామా ‘హిందీ మీడియం’కు సీక్వెల్‌గా తెరక్కెతున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌, రాధినా మదన్‌, డింపుల్‌ కపాడియా, కికూ శారద, రణ్‌వీర్‌ షోరే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఇర్ఫాన్‌ ఖాన్‌ భటుడి వేషంలో కనిపించగా.. రాధికా మదన్‌ అతడిని హత్తుకుని ఉండటంతో పాటుగా పోస్టర్‌పై ఇంగ్లీష్‌ రాతలు, కొన్ని బొమ్మలు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇక ఈ సినిమాను మార్చి 20న విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనుంది. ఈ క్రమంలో క్యాన్సర్‌ బారిన పడి.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న తాను ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నానని ఇర్ఫాన్‌ ఖాన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా... అభిమానుల కోసం ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశాడు.

‘‘నాకు ఈ సినిమా ఎంతో ముఖ్యం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి ఈ సినిమాను ప్రమోట్‌ చేద్దాం అనుకున్నా. కానీ నా శరీరంలో ఎంతో మంది అనవసరపు అతిథులు ఉన్నారు. అందుకే మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాను. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. మళ్లీ నవ్విస్తుంది. ఇంకా ఎన్నెన్నో విషయాలు బోధిస్తుంది. ట్రైలర్‌ను ఎంజాయ్‌ చేయండి. నా కోసం ఎదురుచూడండి’’ అంటూ మూవీ స్టిల్స్‌తో కూడిన ఇర్ఫాన్‌ వాయిస్‌ ఓవర్‌ విని అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇర్ఫాన్‌ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 2018లో ఇర్ఫాన్‌ ఖాన్‌కు క్యాన్సర్‌ సోకిన విషయం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు లండన్‌లో చికిత్స తీసుకున్న అతడు.. గతేడాది ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగి వచ్చాడు. అనంతరం మళ్లీ లండన్‌కు వెళ్లాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా