రాత్రికి రాత్రే రాత మారిపోద్ది..!

19 Jun, 2018 17:36 IST|Sakshi
ఇర్ఫాన్‌ఖాన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : మనిషి జీవితం నీటిలో తేలియాడుతున్న బెండు లాంటిది. కెరటాల ధాటికి దాని ఉనికి ప్రశ్నార్థమవుతుంటే.. ప్రకృతి ప్రసాదించిన జీవితాన్ని నేర్పుతో తీర్చిదిద్దుకోవాలే గానీ, కెరటాల్నే అదుపు చేస్తామని భ్రమపడటం మూర్ఖత్వమే అవుతుందంటున్నారు  బాలీవుడ్‌ క్లాసిక్‌ హీరో ఇర్ఫాన్‌ఖాన్‌. ఒక్క సంఘటనతో జీవితం తల్లకిందులు కావొచ్చని చెప్తున్నారు.  

అరుదైన న్యూరో ఎండోక్రైన్‌ అనే క్యాన్సర్‌ వ్యాధి బారిన పడిన ఆయన లండన్‌లో చికిత్స పొందుతున్నారు. తన జీవితం ముగుస్తుందనే భయానక పరిస్థితుల నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలను ఇర్ఫాన్‌ సోదాహరణంగా ఒక లేఖలో పేర్కొన్నారు. ఒక జాతీయ పత్రికకు ఇర్ఫాన్‌ రాసిన భావోద్వేగపూరిత లేఖలో ఏముందంటే.. ‘రైలులో ప్రయాణిస్తున్నాను. నేను చేరుకోవాల్సిన గమ్యం మరెంతో దూరం ఉంది. జర్నీలో నా గతాన్ని, ఆశలతో కూడిన నా భవిష్యత్తును తలచుకుంటూ హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. అనుకోకుండా నా ఊహాలోకంలో అలజడి. ఎవరిదో చేయి నా భుజంపై పడింది. తిరిగి చూస్తే.. టికెట్‌ కలెక్టర్‌..! ‘నువ్వు దిగాల్సిన స్టేషన్‌ వచ్చింది. సర్దుకో అని సూచన’. అదెలా..! నేను ప్రయాణించాల్సిన దూరం మరెంతో ఉంది అన్నాను. అయినా అతను వినిపించుకోవడం లేదు. ‘మీరు దిగాల్సిందే అంటూ నన్ను బలవంతంగా రైలులోంచి తోసేసే పరిస్థితి తలెత్తింద’ని పేర్కొన్నారు.

ఊహించని ఉపద్రవాలతో కూడిందే జీవితం అని లేఖలో చెప్పుకొచ్చారు. దేవుడి దయ వల్ల, ఎందరో అభిమానుల ఆశిస్సుల వల్ల ఇంకా ప్రాణాలతో ఉన్నానని తెలిపారు. ‘ప్రసిద్ధ మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనేది నా చిన్ననాటి కల. కానీ, ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నాను. ఆస్పత్రి నుంచి బయటికి చూసినప్పుడు.. లార్డ్స్‌ స్టేడియంలో వేలాడుతున్న వివిఎన్‌ రిచర్డ్స్‌ పోస్టర్‌ కనిపించింది. అందులో చిరునవ్వు చిందిస్తున్న రిచర్డ్స్‌ను చూసినప్పుడు అనిపించింది. భూమ్మీద నూకలు ఉంటే అంతా మంచే జరుగుతుందనే సత్యం బోధపడింది. చావు బతుకుల మధ్య పోరాటం ఎప్పటికీ ఉండేదే’ అంటూ క్యాన్సర్‌పై తన స్వీయ పోరాటాన్ని తెలిపారు ఇర్ఫాన్‌.

మరిన్ని వార్తలు