దీపికా నంబర్ వన్నా? కాదా?

8 Dec, 2013 02:12 IST|Sakshi
దీపికా నంబర్ వన్నా? కాదా?
 ‘ఫలానా వారు నంబర్‌వన్ అని మీరెలా డిక్లేర్ చేస్తారు. దేన్ని ప్రామాణికంగా తీసుకుని దీపికను నంబర్‌వన్ అంటున్నారు’’ అని ఓ హిందీ చానల్‌పై కొందరు బాలీవుడ్ తారలు యుద్ధం ప్రకటించారు. వివరాల్లోకెళ్తే... బాలీవుడ్‌లో లేటెస్ట్ నంబర్‌వన్ హీరోయిన్‌గా దీపికా పదుకొనేని డిక్లేర్ చేస్తూ ఓ ప్రముఖ చానల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ఏడాది దీపిక నటించిన రేస్-2, హే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్‌లీలా చిత్రాలు అఖండ విజయం సాధించాయి. ఇందులో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ 200 కోట్ల రూపాయల పై చిలుకు వసూళ్లు రాబట్టగా, మిగిలిన మూడు సినిమాలు వందకోట్ల క్లబ్‌ని అధిగమించేశాయి.
 
  ఒకే ఏడాది మూడు వంద కోట్ల సినిమాలు, ఒక రెండొందల కోట్ల సినిమాలో నటించి దీపిక రికార్డ్ సృష్టించారనీ, బాలీవుడ్ చరిత్రలో ఈ క్రెడిట్ సాధించిన తొలి హీరోయిన్ దీపిక అని, ఈ విజయాలతో బాలీవుడ్‌లో దీపిక తిరుగులేని సూపర్‌స్టార్‌గా అవతరించారని ఆ కథనం సారాంశం. దాంతో సదరు చానల్ అభిప్రాయాన్ని ఖండిస్తూ... ఫేస్‌బుక్‌ల ద్వారా కొందరు బాలీవుడ్ కథానాయికలు యుద్ధం ప్రకటించేశారట. ‘‘ఈ ఏడాది దీపిక నటించిన నాలుగు సినిమాలూ హీరో ఓరియెంటెడ్ సినిమాలే. కాబట్టి ఆ విజయాల క్రెడిట్ మొత్తం ఆమెకే ఆపాదించడం కరెక్ట్ కాదు. 
 
 లక్ కలిసి రావడంతో తగిలిన విజయాలివి. నిజానికి నంబర్‌వన్‌గా ప్రకటించాల్సి వస్తే.. ఆ అర్హత ఒక్క విద్యాబాలన్‌కి మాత్రమే ఉంది. ఆమె నటించిన డర్టీపిక్చర్, కహానీ చిత్రాలు నాలుగు నెలల తేడాతో విడుదలై వందకోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టాయి. పైగా అవి లేడీ ఓరియంటెడ్ సినిమాలు. ఈ క్రెడిట్ పూర్తిగా విద్యకే చెందుతుంది. సో... బాలీవుడ్ నంబర్‌వన్ అంటే విద్యాబాలన్ మాత్రమే. అర్హత లేనివారిని అందలం ఎక్కిస్తే... మేం ఒప్పుకోం’’ అంటూ చిన్నసైజు హెచ్చరికల్నే జారీ చేశారట. ఈ విధంగా ఫేస్‌బుక్కుల ద్వారా మీడియాపై యుద్ధం ప్రకటించిన వారిలో... సోనాక్షి సిన్హా, కంగనారనౌత్ లాంటి కథానాయికలు కూడా ఉన్నట్లు సమాచారం.