త్వరలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ స్టార్ట్‌

28 Jul, 2019 03:08 IST|Sakshi
పూరి జగన్నాథ్, చార్మి, నిధీ అగర్వాల్, సత్యదేవ్‌

– పూరి జగన్నాథ్‌

‘‘హిట్‌ సాధించి మూడేళ్లయింది. నా లైఫ్‌లో ఎప్పుడూ హిట్‌ కోసం తపించని నేను హిట్‌ కొట్టాలని పరితపించడం ఇదే మొదటిసారి. ఫైనల్‌గా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో విజయం వచ్చింది’’ అన్నారు పూరి జగన్నాథ్‌. రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ చిత్రంలో నభా నటేష్, నిధీ అగర్వాల్‌ కథానాయికలుగా నటించారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడులైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ– ‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా విషయంలో నాపై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా విజయం విషయంలో చాలా టెన్షన్‌ పడ్డాను. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. ఇటీవల మా టీమ్‌ చేసిన ఆంధ్రా టూర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరు ఇస్మార్ట్‌ –2 ఎప్పుడని అడుగుతున్నారు. వెంటనే స్క్రిప్ట్‌ వర్క్‌ స్టార్ట్‌ చేసి త్వరలోనే ‘ఇస్మార్ట్‌–2’ తీయాలని ఉంది.

ఆ సినిమా కోసం ‘డబుల్‌ ఇస్మార్ట్‌ 2’ టైటిల్‌  రిజిస్టర్‌ చేసి పెట్టాను. ఇలాంటి మాస్‌ ఫీల్‌ సినిమాలను భవిష్యత్‌లో మరిన్ని తీయాలనుకుంటున్నా.  రేపటి నుంచి తెలంగాణ టూర్‌ చేపట్టబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం తొమ్మిది రోజుల్లో 63 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మేము అనుకున్న కలెక్షన్స్‌ మైలురాయిని చేరుకుంటామనే నమ్మకం ఉంది. రామ్‌ అద్భుతంగా నటించారు’’ అన్నారు ఛార్మి. ‘‘పూరీసార్‌ ఓ డ్రగ్‌లాంటోడు. ఒక్కసారి ఆయనకు అడిక్ట్‌ అయితే వదిలిపెట్టలేం. సినిమా వంద కోట్లు దాటుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యదేవ్‌. ‘‘నా కెరీర్‌లో మైలురాయి వంటి చిత్రమిది’’ అన్నారు నిధీ అగర్వాల్‌.

మరిన్ని వార్తలు