‘వన్ నైట్ షో’ కాదు!

7 Feb, 2015 23:34 IST|Sakshi
‘వన్ నైట్ షో’ కాదు!

‘బిల్లా’ అనే తమిళ చిత్రంలో బికినీ ధరించి నటించిన నయనతార... అందుకు పూర్తి భిన్నంగా ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో మహాపతివ్రత సీతగా నిండైన చీరకట్టులో కనిపించి, ఆకట్టుకున్నారు. దీన్నిబట్టి నయనతార ఏ తరహా పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలుగుతారని అర్థమవుతుంది. ఇప్పుడామె నటిస్తున్న చిత్రాల్లో ‘మాయ’ అనే తమిళ చిత్రం ఒకటి. ఇది హారర్ మూవీ. ఇప్పటివరకూ ఏ చిత్రంలోనూ కనిపించనంత భిన్నంగా నయనతార ఇందులో కనిపిస్తారట.
 
 కొన్ని సన్నివేశాల్లో దెయ్యంలా కనిపించి, భయపెడతారని తమిళ పరిశ్రమలో ఓ వార్త ప్రచారమవుతోంది. ఆ వార్తలకు ఊతం ఇస్తూ, ఓ ఫొటో కూడా బయటికొచ్చింది. ఎరుపు రంగు చీర, అదే రంగు జాకెట్టు, గాజులు, నుదుట రూపాయి కాసంత బొట్టు, కళ్లు పెద్దవి చేసి, కాళికా మాతలా నాలుక బయటపెట్టిన గెటప్ అది. ఆ ఫొటో చూసినవాళ్లు.. నయనతార ఓ రేంజ్‌లో భయపెట్టడం ఖాయం అంటున్నారు.
 
 ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రంలో నయనతార ఒక బిడ్డకు తల్లిగా నటిస్తున్నారు. అలాగే, నూతన దర్శకుడు అశ్విన్ దర్శకత్వంలో ఆమె ఈ చిత్రం చేయడం ఓ విశేషం అయితే, ఇందులో ఆరి అనే వర్థమాన నటునితో నటించడం మరో విశేషం. వాస్తవానికి ఈ చిత్రానికి ‘వన్ నైట్ షో’ అనే టైటిల్‌ని అనుకున్నారు. కానీ, ఇది అభ్యంతరకరమైన చిత్రం అయ్యుంటుందనే ఫీల్‌ని ఆ టైటిల్ కలగజేసే విధంగా ఉందని ‘మాయ’ అని మార్చారు. ఈ మార్పు వెనకాల నయనతార హస్తం ఉందని సమాచారం.