కొంపదీసి అవన్నీ మార్చేశారా: నటుడు

29 Jan, 2020 15:54 IST|Sakshi

సీఏఏ: ట్రోల్స్‌కు జావేద్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు గళం విప్పుతున్న విషయం తెలిసిందే. వారిలో నటుడు జావేద్‌ జాఫ్రీ కూడా ఒకరు. సీఏఏ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉండే జావేద్‌.. సీఏఏను వ్యతిరేకిస్తూ సోషలిస్టులు, డెమొక్రాట్‌ గ్రూపు యూరోపియన్‌ పార్లమెంటుకు తీర్మానం పంపిన వార్తను తన ట్విటర్‌ అకౌంట్లో షేర్‌ చేశారు. 

ఇక అప్పటి నుంచి జావేద్‌ను టార్గెట్‌ చేస్తూ కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. సీఏఏపై తీర్మానం యూరోప్‌నకు వెళ్లినపుడు నువ్వు మాత్రం భారత్‌లో ఉండి ఏం చేస్తావు? నువ్వు కూడా అక్కడికే వెళ్లు. నీలాంటి దేశ ద్రోహులు నా జాతికి అవసరం లేదు’ అంటూ ఆయనపై విషం చిమ్ముతున్నారు. అయితే జావేద్‌ కూడా అదే స్థాయిలో వారికి కౌంటర్‌ ఇస్తున్నారు. ‘‘ఏంటీ మీ జాతా?? ఎంతకు కొన్నారు మేడమ్‌?? గతంలో ఎప్పుడో ఒకసారి నేను రాజ్యాంగం గురించి చదువుకున్నా. అందులో ప్రజాస్వామ్యం గురించి.. ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే హక్కుల గురించి ఉంది. కొంపదీసి మాకు తెలియకుండా మీరేమైనా మార్పులు చేశారా. అలా అయినట్లయితే నాకు కూడా కాస్త చెప్పండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా సీఏఏ, ఎన్నార్సీ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ తనదైన శైలిలో స్పందించారు.

మరిన్ని వార్తలు