చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి: జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌

6 Dec, 2017 17:47 IST|Sakshi

వర్ధమాన హాస్య నటుడు మహేష్‌

మామిడికుదురు (పి.గన్నవరం): తెలుగు చిత్రసీమలో హాస్య నటుడిగా గుర్తింపు పొందాలన్నదే తన లక్ష్యమని వర్ధమాన హాస్యనటుడు మహేష్‌ ఆచంట పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు పెదపట్నంలంక వచ్చిన మహేష్‌ మంగళవారం స్థానిక విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’,.. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రంతో పాటు.. అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న ‘ఒక్క క్షణం’ , ‘మహానటి సావిత్రి’ చిత్రాల్లో ప్రస్తుతం తాను నటిస్తున్నాని చెప్పారు.  

మలికిపురం మండలంలోని శంకరగుప్తం తమ స్వగ్రామమని తెలిపారు. మలికిపురంలో ఇంటర్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశానని మహేష్‌ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంబీఏ చేస్తూనే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించానన్నారు. ఆ ప్రయత్నంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. 

ఇంత వరకూ 65 సినిమాల్లో నటించానని, 80కి పైగా టీవీ ఎపిసోడ్స్‌లో నటించానని చెప్పారు. ‘ఖైదీ నెంబర్‌–150’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలు తనకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయని మహేష్‌ పేర్కొన్నారు. చిన్నాన్న బోనం అంజి, సోదరుడు రేకపల్లి బాబీ తనను ఎంతో ప్రోత్సహించారన్నారు.   

మరిన్ని వార్తలు