'జాగ్వర్' మూవీ రివ్యూ

6 Oct, 2016 13:59 IST|Sakshi
'జాగ్వర్' మూవీ రివ్యూ

టైటిల్ : జాగ్వర్
జానర్ : యాక్షన్ ఎంటర్టైనర్
తారాగణం : నిఖిల్ గౌడ, దీప్తి సేతి, జగపతిబాబు, రావూ రమేష్, సంపత్ రాజ్, ఆదిత్య మీనన్
సంగీతం : ఎస్ ఎస్ థమన్
దర్శకత్వం : మహదేవ్
నిర్మాత : అనితా కుమారస్వామి, హెచ్ డి కుమారస్వామి

మాజీ ప్రధాని మనువడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా పరిచయం అయిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ జాగ్వర్. నిఖిల్ మాతృభాష కన్నడ అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడ తొలి సినిమాతోనే చేరువయ్యే ఉద్దేశంతో జాగ్వర్ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. బాలకృష్ణతో 'మిత్రుడు' సినిమాను రూపొందించిన మహదేవ్ ఈ సినిమాకు దర్శకుడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించటంతో జాగ్వర్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జాగ్వర్‌తో నిఖిల్ గౌడ సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడా..?


కథ :
ఎన్నో వ్యాపారాలు ఉన్న ప్రముఖ వ్యాపార వేత్త సంపత్ రాజ్, తన వ్యాపారాలన్నింటినీ కాపాడుకునేందుకు ఎస్ ఎస్ టివి అనే న్యూస్ చానల్‌ను నిర్వహిస్తుంటాడు. తన టీవీ టీఆర్పీలు పెంచుకునేందుకు ఎలాంటి పనికైనా సిద్ధపడే సంపత్ ఛానల్‌ను ఓ ముసుగు మనిషి(నిఖిల్ గౌడ) హ్యాక్ చేసి ఓ మర్డర్‌ను లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. లైవ్‌లో జడ్జిని మర్డర్ చేసిన ముసుగు వ్యక్తిని పట్టుకునే బాధ్యత సిబిఐ ఆఫీసర్ జెబి(జగపతిబాబు)కి అప్పగిస్తారు. తను డీల్ చేయబోయే ఆ కేసుకు ఆ మర్డర్ చేసిన వ్యక్తికి జాగ్వర్ అని పేరు పెట్టుకుంటాడు జెబి.

ఎస్ ఎస్ కృష్ణ(నిఖిల్ గౌడ), తనని తాను అనాథగా పరిచయం చేసుకొని శాంతి మెడికల్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే కాలేజిలో ఫైనల్ ఇయర్ చదివే సిన్సియర్ స్టూడెంట్ ఆర్యతో ఫస్ట్ రోజునుంచే గొడవ పడతాడు. అదే సమయంలో ఆర్య.., కాలేజ్‌లో, హాస్పిటల్లో జరిగే అన్యాయాల మీద పోరాటం మొదలు పెడతాడు. ఆర్యని బెదిరించడానికి  వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ శంకర్ కూడా జాగ్వర్ చేతిలో చనిపోతాడు. అసలు కృష్ణ, జాగ్వర్ పేరుతో ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? నిజంగానే కృష్ణ అనాథేనా..? జాగ్వర్ కేసును డీల్ చేస్తున్న జెబి జాగ్వర్ను పట్టుకున్నాడా..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
తొలి సినిమాతో తనని తాను అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్. ఆశించినట్టుగా డ్యాన్స్‌లు, ఫైట్ల విషయంలో ఆకట్టుకున్నా.. నటుడిగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. హీరోయిన్గా నటించిన దీప్తి సేతి తెరమీద కనిపించింది కొద్ది సేపే.. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అభ్యుదయ భావాలున్న వ్యక్తి పాత్రలో రావూ రమేష్ మరోసారి తన మార్క్ చూపించాడు. విలన్లుగా సంపత్ రాజ్, ఆదిత్య మీనన్‌లు ఆకట్టుకున్నారు. కీలక పాత్రలో రమ్యకృష్ణ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్ సాంగ్‌లో తమన్నా అందాలు అలరిస్తాయి.

సాంకేతిక నిపుణులు :
భారీ నేపథ్యం ఉన్న యువ కథానాయకుణ్ని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్న దర్శకుడు మహదేవ్, రివేంజ్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తొలి సినిమాతోనే నిఖిల్‌ను మాస్ యాక్షన్ హీరోగా లాంచ్ చేసేందుకు చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదు. భారీ తనం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన యూనిట్ కథా కథనాలను ఆ స్ధాయిలో రెడీ చేసుకోలేదు. రొటీన్ రివేంజ్ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. టెక్నికల్‌గా మాత్రం జాగ్వర్ సూపర్బ్. మనోజ్ పరమహాంస సినిమాటోగ్రఫి బాగుంది. ముఖ్యంగా యాక్షన్, చేజ్ సీన్స్‌లో కెమరా వర్క్ ఆకట్టుకుంటుంది. థమన్ అందించిన పాటలు పెద్దగా అలరించకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం చాలా సీన్స్‌కు మరింత హైప్ తీసుకు వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
పాటలు
సెకండ్ హాఫ్ లెంగ్త్
కామెడీ

ఓవరాల్‌గా జాగ్వర్ సినిమాతో నిఖిల్ గౌడ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం మరో ప్రయత్నం చేయక తప్పదు.

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా